Karimnagar crop damage from cyclone : ఆరుగాలం శ్రమించిన అన్నదాతకు అకాల వర్షం అంతులేని శోకాన్ని మిగిల్చింది. ‘మొంథా’ తుపాను రూపంలో వచ్చిన ప్రళయానికి ఉమ్మడి కరీంనగర్ జిల్లా విలవిల్లాడిపోయింది. రాత్రికి రాత్రే కురిసిన కుండపోత వానకు, చేతికొచ్చిన పంట కళ్లెదుటే నీటిపాలైంది. కోతకోసి ఆరబోసిన ధాన్యం రాశులు కొట్టుకుపోగా, నిలబడిన వరి పొలాల్లో ఇసుక మేటలు వేసి, రైతుల ఆశలను పూర్తిగా సమాధి చేసింది. గత 35 ఏళ్లలో ఇంతటి ఘోరమైన నష్టాన్ని చూడలేదని రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. అసలు కరీంనగర్ జిల్లాలో నష్టం ఏ స్థాయిలో ఉంది? అన్నదాతల ఆవేదనకు అంతులేకుండా పోవడానికి కారణమేంటి?
రాత్రికి రాత్రే ప్రళయం : మొంథా తుఫాన్ ధాటికీ కమ్ముకొచ్చిన మేఘాలు, రైతుల జీవితాల్లో చీకట్లను నింపాయి. హుజూరాబాద్, చిగురుమామిడి, సైదాపూర్, శంకరపట్నం వంటి మండలాల్లో ఏకంగా 20 సెంటీమీటర్లకు పైగా రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది. ఈ కుంభవృష్టి ధాటికి పొలాలన్నీ చెరువులే.. వరి పొలాలన్నీ పూర్తిగా నీట మునిగి చెరువులను తలపిస్తున్నాయి.
ఇసుక మేటలు: ముఖ్యంగా సైదాపూర్ మండలంలో, వరద ప్రవాహానికి కొట్టుకొచ్చిన ఇసుక, పంట పొలాలపై పేరుకుపోయి, వరి కోసే పరిస్థితి కూడా లేకుండా పోయింది.
కొట్టుకుపోయిన ధాన్యం: కొనుగోలు కేంద్రాల్లో, కల్లాల్లో ఆరబోసిన వేల క్వింటాళ్ల ధాన్యం వరద ఉద్ధృతికి కొట్టుకుపోయింది. వ్యవసాయ శాఖ ప్రాథమిక అంచనాల ప్రకారం, జిల్లాలోని 15 మండలాల్లో 183 గ్రామాల్లో ఏకంగా 34,127 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. ఇందులో సింహభాగం, 30,565 ఎకరాల్లో వరి పంట కాగా, 3,512 ఎకరాల్లో పత్తి దెబ్బతింది.
గుండె చెరువైన అన్నదాత : రాత్రి కురిసిన వర్షానికి మరుసటి రోజు ఉదయం పొలాలకు వెళ్లి చూసిన రైతుల గుండె చెరువైంది. “లక్షలు అప్పు చేసి పెట్టుబడి పెడితే, ఇప్పుడు పొలంలో ఇసుక తప్ప వరి కనిపించడం లేదు. గత 35 ఏళ్లలో ఎన్నో వానలు చూశాం, కానీ ఇంతటి నష్టాన్ని ఎప్పుడూ చూడలేదు,” అంటూ రైతులు బోరున విలపిస్తున్నారు.
చేతికొచ్చిన పంట నేలకొరిగి, కొన్నిచోట్ల మొలకెత్తడం ప్రారంభించింది. కౌలు రైతుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. ముందుగానే కౌలు చెల్లించి సాగు చేసిన వారు, ఇప్పుడు అటు పంటను, ఇటు పెట్టిన పెట్టుబడిని కోల్పోయి రోడ్డున పడ్డారు. “నోటికాడికి వచ్చిన ముద్ద నీళ్ల పాలైంది, ప్రభుత్వం ఆదుకోకపోతే మాకు ఆత్మహత్యలే శరణ్యం” అని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వ భరోసా : ఈ ప్రళయంలో కేవలం పంటలే కాదు, మూగజీవాలు కూడా బలయ్యాయి. కరీంనగర్ లోయర్ మానేరు గేట్లు ఎత్తడంతో వరద పోటెత్తి, సుమారు 16 వేల బాతు పిల్లలు మృత్యువాత పడ్డాయి. దీంతో రూ.20 లక్షల నష్టం వాటిల్లిందని పెంపకందారులు వాపోయారు.
తుపాను నష్టంపై స్పందించిన ప్రభుత్వం, సహాయక చర్యలు చేపట్టింది. సిద్దిపేటలో నీట మునిగిన పంట పొలాలను పరిశీలించిన మంత్రి పొన్నం ప్రభాకర్, నష్టపోయిన రైతులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో నష్టం తీవ్రంగా ఉందని, అక్కడ పర్యటించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరినట్లు తెలిపారు. ఈ ప్రకృతి వైపరీత్యం నుంచి రైతులను గట్టెక్కించడానికి కేంద్ర ప్రభుత్వం కూడా ముందుకు వచ్చి సహాయం అందించాలని ఆయన డిమాండ్ చేశారు.


