కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ కేంద్రంలో కరీంనగర్ పోలీస్ కమిషనర్ అభిషేక్ మొహంతి ఆధ్వర్యంలో రానున్న గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్బంగా గణేష్ ఉత్సవ్-2024 పేరిట సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశనికి ముఖ్య అతిధిగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తో పాటు పోలీసు కమిషనరేట్‌లోని మొత్తం 16 మండలాలు, 4 మున్సిపాలిటీలు, 1 మున్సిపల్ కార్పొరేషన్‌కు చెందిన ప్రజాప్రతినిధులు, గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్బంగా ముఖ్య అతిథి మాట్లాడుతూ ఉత్సవ్ కమిటీ సభ్యులందరూ తమ ఏర్పాట్లను సక్రమంగా నిర్వహించాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ పేర్కొన్నారు. మండపాల వద్ద 24 గంటలూ వాలంటీర్లు ఉండాలని, తమ మండపాల వద్ద జరిగే కార్యక్రమాలకు పూర్తి బాధ్యత వహించాలని ఆయన కోరారు. శాంతి, సామరస్యాలను కాపాడేందుకు సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారాలు మానుకోవాలని ప్రజలను కోరారు. ఉత్సవ్ కమిటీ సభ్యులు తమ కార్యకలాపాలకు బాధ్యత వహించడం ప్రాముఖ్యతను ఆయన వివరించారు. నిమజ్జన మార్గాలను సకాలంలో మరమ్మతులు చేసేందుకు మున్సిపల్, ఆర్‌అండ్‌బీ అధికారులు చూసుకోవాలని, వైద్యశాఖ అధికారులు మరిన్ని వైద్య సదుపాయాలు ఏర్పాటు చేయాలని కోరారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి విగ్రహ ప్రతిష్ఠాపన నుంచి నిమజ్జనం వరకు సౌకర్యాలు కల్పించాలని కోరారు. కరీంనగర్ కమిషనరేట్‌లోని అన్ని మండలాలు, మున్సిపాలిటీలు మున్సిపల్ కార్పొరేషన్‌ల నుండి ఇతర సభ్యులు ఉత్సవ్ కమిటీ సభ్యులతో ఈ సమన్వయ సమావేశాన్ని ఏర్పాటు చేసినందుకు పాల్గొన్న వారందరూ కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ అధికారులకు ధన్యవాదాలు తెలిపారు.
కరీంనగర్ కలెక్టర్ మాట్లాడుతూ గణేష్ ఉత్సవాలకు అవసరమయ్యే ఏర్పాట్లను సకాలంలో జరిగేలా వివిధ శాఖలతో సమన్వయం చేసుకుంటామని పేర్కొన్నారు. విద్యుత్తు, ఆర్‌అండ్‌బీ, అగ్నిమాపక, వైద్య, మత్స్య, టీఎస్‌ఆర్‌టీసీ, ఆర్టీఏ తదితర శాఖల అధికారులు కూడా వేడుకలను సజావుగా నిర్వహించేందుకు తమ శాఖల నుంచి చేస్తున్న ఏర్పాట్లను వివరించారు. మండపాల నిర్వాహకులు దర్శనానికి వచ్చే మహిళలకు రక్షణ ఉండే విధంగా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. రానున్న గణేష్ ఉత్సవాల సందర్భంగా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని ఏర్పాట్లను చేయటం కొరకు ఈ సమావేశం నిర్వహించడం జరిగిందని అభిషేక్ మహంతి తెలిపారు.
ఈ కార్యక్రమంలో బండి సంజయ్, యూనియన్ హోమ్ ఎఫైర్స్ – ఎంపీ, కరీంనగర్, మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కె.సత్యనారాయణ, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, సుడా చైర్మన్ నరేందర్ రెడ్డి, గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు ఇతరులు సుమారు 200 మంది అధికారులలో, అభిషేక్ మొహంతి, పోలీస్ కమిషనర్, పమేలా సత్పతి, కలెక్టర్. మునిసిపల్ కమీషనర్ చహత్ బాజ్‌పాయ్, ఐఏఎస్, ప్రఫుల్ దేశాయ్, ఐఏఎస్, అదనపు కలెక్టర్ ఇతర అధికారులు పాల్గొన్నారు.