Friday, November 22, 2024
HomeతెలంగాణKarimnagar: ప్రశ్నిస్తే కేసులు పెడతారా?

Karimnagar: ప్రశ్నిస్తే కేసులు పెడతారా?

కౌశిక్ మీద పెట్టిన కేసు ఉపసంహరించుకోవాలి

ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే కేసులు పెడతారా? అంటూ బీఆర్ఎస్ నేతలు నిప్పులుచెరిగారు.
ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మీద అక్రమంగా పెట్టిన కేసు తక్షణమే ఉపసంహరించుకోవాలని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ డిమాండ్ చేశారు. కరీంనగర్ లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ…
“మేము శాసనసభ్యులు. ప్రజలచే ఎన్నికయ్యాం. ఏవైనా సమస్యలు ఉంటే ప్రస్తావించాల్సిన బాధ్యత మాపై ఉంటుందని అన్నారు. మంగళవారం జరిగిన జిల్లా పరిషత్ సమావేశంలో హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అక్కడ ఇటీవల జరిగిన ఎంఈఓ లను బాధ్యతలనుంచి తప్పించి విషయమై దళిత బంధు విషయాన్ని, ఆసుపత్రి విషయాన్ని ప్రస్తావించారని అన్నారు.
తమ విధులకు ఆటంకం కలిగించారని జిల్లా పరిషత్ సీఈవో పోలీసులకు ఫిర్యాదు చేయడం క్రిమినల్ కేసు నమోదు చేయడం చాలా దురదృష్టకరమని కరీంనగర్ జిల్లా చరిత్రలో ఇప్పటివరకు ఇలాంటి కేసు నమోదు కాలేదన్నారు. తాను కూడా గతంలో మంత్రిగా పనిచేశానని, జీవన్ రెడ్డి కూడా మంత్రిగా పనిచేశారని గుర్తు చేశారు. గతంలో జిల్లా పరిషత్ సమావేశాల్లో బి అర్ ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జీవన్ రెడ్డి, శ్రీధర్ బాబు ఎన్నో సమస్యలను సభ దృష్టికి తీసుకువచ్చారని గట్టిగా మాట్లాడారని కానీ ఏనాడు మేము కేసులు పెట్టలేదన్నారు.
కౌశిక్ రెడ్డి మాట్లాడింది జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో.. బయట కాదు.. మాకు మాట్లాడే హక్కు లేదా? ఎఫ్ఐఆర్ ఎలా చేస్తారు? ప్రజా సమస్యలు సభ దృష్టికి తీసుకువస్తే గొంతు నొక్కేస్తారా? అని ప్రశ్నించారు.
కరీంనగర్ పోలీసు కమిషనర్ ఈ విషయాన్ని ఆలోచించాలి. ఈ విషయమే విచారణ చేయాలి. ఎవరిది తప్పైతే వారిని శిక్షించాలి. విచారణ చేయాలని సిపి ని కోరడం జరిగిందన్నారు. సిపి కూడా సానుకూలంగా స్పందించారు. కాంగ్రెస్ పార్టీ, బి ఆర్ ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను సమానంగా చూడాలని సిపి ని కోరాం. సిపి పై నమ్మకం ఉంది న్యాయం చేస్తారని భావిస్తున్నామని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కోరుతున్నాం.. సీఎం గతంలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలపై కక్షసాధింపులు ఉండవని ప్రకటించారు. కానీ ప్రస్తుతం కరీంనగర్ జిల్లాలో జరుగుతున్నది ఏమిటి? ఏ సమస్యలు ఉన్న చెప్పవచ్చని ముఖ్యమంత్రి చెప్పారు. ఒక ఎమ్మెల్యే పై కేసు పెట్టడం మంచి పద్ధతి కాదు. వెంటనే ముఖ్యమంత్రి జోక్యం చేసుకొని కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ఆదేశాలు ఇవ్వాలి. ప్రతిపక్షాల గొంత నొక్కడం మంచి పద్ధతి కాదు. కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రికి చెడ్డ పేరు తీసుకువచ్చే విధంగా ఇక్కడి వ్యవహరిస్తున్నారు అని అన్నారు. భవిష్యత్తులో నేను కూడా మాట్లాడాల్సి వస్తుంది. అయితే ఎఫ్ఐఆర్ ఇష్యూ చేస్తారా? నియోజకవర్గ సమస్యలను అడుగుతాం.. ఎఫ్ఐఆర్ చేస్తారా? ఇలా ఎన్ని కేసులు పెడతారు? ఎంతమందిపై పెడతారు?
రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో కూడా మాట్లాడతాం కేసులు పెడతారా? గతంలో ఇలా కాలేదే! ఏ సిఎం, ఏ స్పీకర్ ఇలా సభ్యులపై కేసులో పెట్టలేదే! అని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
ఎమ్మెల్యే పై కేసు విషయాన్ని పునరాలోచించాలి. ఈ విషయమే పూర్తి విచారణ చేసి కేసును తక్షణమే తొలగించాలి. ప్రభుత్వం కూడా ఈ విషయమై ఆదేశాలు ఇవ్వాల”ని అన్నారు.
హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ…
మాజీమంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తో కలిసి కరీంనగర్ పోలీసు కమిషనర్ ను కలవడం జరిగింది అన్నారు. కరీంనగర్ జిల్లా పరిషత్ సమావేశంలో మీడియా సాక్షిగా నేను కొన్ని ప్రశ్నలు లేవనెత్తాను హుజురాబాద్ లో నిరుపేద ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ విద్యార్థులు చదువుతున్న ప్రభుత్వ పాఠశాలల పనితీరుపై సమీక్ష సమావేశం నిర్వహించాను. దీనికి ఎంఈఓ లతోపాటు పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులు హాజరయ్యారు. అయితే ఈ సమావేశానికి ఎలా హాజరయ్యారంటూ కరీంనగర్ డీఈవో ఎంఈఓ లకు నోటీసు అందజేశారు. ఇది చాలా బాధాకరంగా ఉందన్నారు. గతంలో మంత్రిగా గంగుల కమలాకర్ ఉన్నప్పుడు కరీంనగర్ జిల్లా కేంద్రంలో పాఠశాలలో పున ప్రారంభమయ్యే ముందు విద్యాశాఖ రివ్యూ మీటింగ్ ప్రతి ఏడాది నిర్వహించేవారు. కానీ ఇక్కడ మంత్రులు సమీక్ష సమావేశం నిర్వహించకుండా విద్యార్థుల సమస్యలు పాఠశాలలు గాలికి వదిలేశారు. కానీ నేను హుజరాబాద్ నియోజకవర్గంలో ఒక బాధ్యత కలిగిన శాసనసభ్యునిగా సమీక్ష సమావేశం నిర్వహిస్తే విద్యార్థుల సమస్యలు తెలుసుకుంటే ఎంఈఓ లకు నోటీసులు పంపించడం ఎంతవరకు సమంజసం? అని ప్రశ్నించారు. ఈ విషయమై నేను జిల్లా పరిషత్ సమావేశంలో ప్రస్తావిస్తే అధికారులు పారిపోయారు. అధికారులు మేము అడిగిన ప్రశ్నలకు సమాధాన చెప్పలేక పోతే.. ఎందుకు తప్పుడు పనులు చేస్తున్నారని ప్రశ్నిస్తున్న.. అధికారులు సమాధానం లేకనే అక్కడి నుండి నిష్క్రమించారు. ఇలాంటి పరిస్థితిని అధికారులు ఎందుకు కొని తెచ్చుకుంటున్నారో అర్థం కావడం లేదన్నారు. ప్రభుత్వాలు ఏవైనా ఉండొచ్చు కానీ అధికారులు నిబంధనల ప్రకారం చట్ట ప్రకారం ఈ విధంగా ఉంటే ఆ విధంగా చేయాలి. అధికారులు తమ మనస్సాక్షిగా ఈ విషయమై ఆలోచన చేసుకోవాలని ఉన్నారు.
జెడ్పీ సమావేశానికి జిల్లా పరిషత్ చైర్మన్ అధ్యక్షత వహిస్తారు. చైర్మన్ ఆదేశాలు లేకుండా సీఈఓ ఎలా పోలీసులకు ఫిర్యాదు చేస్తారు? అని ప్రశ్నించారు. ఒక శాసనసభ్యునిగా అసెంబ్లీలో జిల్లా పరిషత్ సమావేశాల్లో నా గళాన్ని వినిపించే హక్కు, సమస్యలను ప్రస్తావించే బాధ్యత నాకు ఉంది దాన్ని మీరు ఎలా కాలరాస్తారు అని నిలదీశారు.
నేను సమస్యలనే జిల్లా పరిషత్ సమావేశంలో ప్రస్తావించాను. డీఈవో ఏమీ వాళ్లకు ఎందుకు నోటీసులు ఇచ్చారని, దళిత బంధు నిధులను ఎందుకు మంజూరు చేయడం లేదని, హుజురాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో కెసిఆర్ కిట్లు ఎందుకు ఇవ్వడంలేదని, ప్రసూతి అయిన మహిళలకు డబ్బులు ఎందుకు ఇవ్వడంలేదని, న్యూట్రీషియన్ కిట్ ఎందుకు ఇవ్వడం లేదని, జమ్మికుంటలో గైనకాలజిస్ట్ డాక్టర్ ను ఎందుకు తీసివేశారని నేను ప్రశ్నించాను. నేను ప్రశ్నించడమే తప్పా? అధికారులు సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతుంటే, మా జడ్పిటిసి లతో, సభ్యులతో నాకు న్యాయం చేయండి కలెక్టర్ గారు అని మేము అడిగాం. ఇందులో తప్పేమీ ఉంది? దీనికి కేసు పెడితే ఎలా? అని అన్నారు. మమ్మల్ని అడ్డుకున్న విషయమే మేము కూడా సిపి కి ఫిర్యాదు చేసాము. రిసీవ్డ్ కాపీ కూడా తీసుకున్నాము. సిపి విచారణ చేసి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సిపి పై నమ్మకం విశ్వాసం ఉన్నాయి. ఆయన న్యాయం చేస్తారని విశ్వసిస్తున్నామని చెప్పారు. నేను అధికారులకు విజ్ఞప్తి చేస్తున్న.. ఇప్పటికైనా అధికారులు మంత్రి పొన్నం ప్రభాకర్ మాటలు నమ్మి ఆగం కావద్దు. గతంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మాటలు నమ్మిన జమ్మికుంట ఎమ్మార్వో జైలుకు వెళ్లారు. కమలాపూర్ ఎమ్మార్వో కూడా జైల్లోనే ఉన్నారు. కానీ మంత్రి మాత్రం బయట హాయిగా తిరుగుతున్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ చట్టవిరుద్ధమైన పనులు చేయమంటే చేయకండి. ఆగం కావద్దు. మంత్రి ట్రాప్ లో పడి ఇబ్బందులు పడొద్దు అని అన్నారు. నేను కూడా స్పీకర్ ని కలిసి ప్రివిలైజ్ మోషన్ డీఈవో పై సీఈవో పై మూవ్ చేస్తాను. ఈ విషయమై అసెంబ్లీలో కూడా లేవనెత్తుతా. ప్రభుత్వాన్ని నిలదీస్తానని చెప్పారు.
ఇలా కేసులు పెట్టి ఇబ్బంది పెడితే భయపడేది లేదు. ప్రజల సమస్యలపై ఖచ్చితంగా కొట్లాడతాం. ఆరు గ్యారెంటీలు ఇచ్చేవరకు ప్రభుత్వం వెంట పడతాం. మా పార్టీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన సహించేది లేదు. ఖచ్చితంగా మాజీమంత్రి గంగుల కమలాకర్ వినోద్ కుమార్ ల నాయకత్వంలో పోరాడతామని అన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News