అధికారులు తలుచుకుంటే ఏదైనా సాధ్యమే అని చెప్పేందుకు నిదర్శనం ఈ సంఘటన. లక్షలు విలువ చేసే భూమిని తమ బినామీల పేర్లపై మార్పిడి చేశారంటే ఎంతకు తెగించారో అర్థం చేసుకోవచ్చు. ఒకప్పటికి ఇప్పటికీ భూముల ధరలు పదింతలు పెరగడంతో ఏ చిన్న అవకాశం దొరికిన తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు…
వివరాల్లోకి వెళితే కరీంనగర్ జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న రేకుర్తిలో దుర్గం మల్లమ్మకు సర్వేనెంబర్ 151/G లో 0.0700 ఏడు గుంటలు నివేషణ స్థలం ఉంది. ఈమెకు భర్త, పిల్లలు ఎవరూ లేరు. ఒంటరిగా ఉన్న మల్లమ్మ 2011 ఆగస్టు 20వ తేదీన మృతి చెందింది. మృతురాలు మల్లమ్మకు తోడబుట్టినోళ్ళు ఇద్దరు అన్నదమ్ములు ఉన్నప్పటికీ సదరు భూమిని ఎలాగైనా దక్కించుకోవాలని ఉద్దేశంతో స్థానిక కార్పొరేటర్ భర్త, తాహసిల్దార్ చిల్ల శ్రీనివాస్ ఇద్దరు కలిసి మృతురాలి అక్క కుమారుడైన బండారి కనకయ్య పేరుపై 2022 జూలై 1న బదలాయింపు చేసుకొని ఆ భూమిని కార్పొరేటర్ భర్త కారు డ్రైవర్ అయిన గుర్రం సత్యంకు, తాహసిల్దార్ బినామీ అయిన చంద సంతోష్ కు అక్రమ రిజిస్ట్రేషన్ చేశారు.
అక్రమ రిజిస్ట్రేషన్ లో జరిగిన తప్పిదాలపై గతంలో మల్లమ్మకు సంబంధించిన తమ్ముని కుమారుడు దుర్గం అంజనేయులు ప్రజావాణిలో ఫిర్యాదు చేశాడు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి సదరు సర్వేనెంబర్ లోని రిజిస్ట్రేషన్ పై క్షేత్రస్థాయిలో విచారణ చేపడితే వాస్తవాలు వెలుగు చూసే అవకాశం ఉంది. అధికారులు ఏ మేరకు స్పందిస్తారో వేచి చూద్దాం.