ప్రజలకు ఎక్కడ ఇబ్బంది లేకుండా కూడు, గూడు, గుడ్డ, నీడ అనే నినాదంతో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ముందుకు సాగుతోందని కరీంనగర్ నగర మేయర్ యాదగిరి సునీల్ రావు అన్నారు. కరీంనగర్ లో బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ స్థాయి ప్లీనరీ సమావేశం సందర్భంగా నగరంలోని 60 డివిజన్ లలో గులాబీ జెండాలు రెపరెపలాడాయి. డివిజన్ ల వారీగా బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు, డివిజన్ అద్యక్షులు, సీనియర్ నాయకుల ఆద్వర్యంలో పార్టీ జెండాలు ఆవిష్కరించారు.
ఈ నేపథ్యంలో నగరంలోని మేయర్ ప్రాతినిధ్యం వహిస్తున్న 33వ డివిజన్ భగత్ నగర్ అయ్యప్ప దేవాలయం సమీపంలో మేయర్ యాదగిరి సునీల్ రావు సమక్షంలో డివిజన్ అధ్యక్షులు ఉపేంధర్ పార్టీ జెండాను ఎగురవేసి నినాదాలు చేశారు. అనంతరం మేయర్ యాదగిరి సునీల్ రావు టపాసులు కాల్చి స్వీట్లు పంపిణీ చేస్తూ సంబరాలు చేశారు. మరోవైపు 3వ డివిజన్ కిసాన్ నగర్ లో కార్పొరేటర్ కంసాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో నగర మేయర్ యాదగిరి సునీల్ రావు డివిజన్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి గులాబీ జెండాను ఎగురవేసి నినాదాలు చేశారు. అనంతరం రాజశ్రీ గార్డెన్ లో జరిగిన ప్లీనరీ సమావేశానికి కార్యకర్తలు, నాయకులతో కలిసి మేయర్ బయలుదేరారు.
ఈ సందర్భంగా మేయర్ యాదగిరి సునీల్ రావు మాట్లాడుతూ ప్రజల సంక్షేమం, తెలంగాణ అభివృద్ధే ధ్యేయంగా కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం పని చేస్తోందన్నారు. గత 9 సంవత్సరాల కాలంగా కేసీఆర్ నాయకత్వంలో గతంలో ఉన్న ప్రభుత్వాలకు భిన్నంగా పేద ప్రజలకు అనేక రకాల సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలనలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అభివృద్ధికి చిరునామాగా మారిందన్నారు. తెలంగాణ అంటేనే దేశానికి దశ దిశను చూపే దిక్సూచిగా తయారైందన్నారు. 9 సంవత్సరాల కేసీఆర్ పాలనలో జరిగిన అభివృద్ధి సంక్షేమం పై ప్లీనరీ సమావేశంలో చర్చించుకొని రాబోయే రోజుల్లో ప్రజలకు ఎలాంటి సంక్షేమ ఫలాలు అందించాలనే అంశాలను చర్చించుకుంటామన్నారు. ప్రతిపక్ష బీజేపి, కాంగ్రెస్ పార్టీలు ప్రభుత్వంపై చేస్తున్న అసత్యాలు, అవాస్తవాలను ఎండగట్టాలన్నారు. వాళ్ళు పరిపాలిస్తున్న రాష్ట్రాల్లో ఎలాంటి అభివృద్ధి, సంక్షేమాలు లేకున్నా తెలంగాణలో ప్రజలకు అందిస్తున్న సంక్షేమాన్ని చూసి ఓర్వలేక విమర్శలు చేస్తున్నారని, వాటిని గులాబీ సైన్యం దండుగా ఎండగట్టేందుకు ముందుకు సాగుతామన్నారు.
బీజేపి ప్రభుత్వం చేస్తున్న విష ప్రచారాన్ని ఎండగట్టి వారు పరిపాలిస్తున్న రాష్ట్రాల్లో జరుగుతున్న అరాచకత్వ, అవినీతిని గులాబీ సైన్యం నిలదీయాలని పిలుపునిచ్చారు. రాబోయే నెలల్లో ఎప్పుడు ఎన్నికలు జరిగినా కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ హాట్రిక్ కొట్టేందుకు సిద్దంగా ఉందన్నారు. తెలంగాణలో 40 లక్షల మంది పింఛన్ తీసుకునే పేద ప్రజలు, 65 లక్షల మంది రైతు బంధు రైతులు ముఖ్యమంత్రి కేసీఆర్ ను దీవిస్తున్నారని తెలిపారు. రైతు భీమా పొందిన రైతు కుటుంబాలు, దళిత బంధు పొందిన దళిత కుటుంబాలు కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఆశీర్వదిస్తున్నారని అన్నారు. గత ప్రభుత్వాల పాలనలో అప్పులతో ఆత్మహత్యలు చేసుకున్న రైతుల్లో సాగు నీరు, ఉచిత కరెంట్, రైతు భీమా, రైతు బంధు అందించి భరోసా కల్పించిన ఏకైక నాయకుడు సీఎం కేసీఆర్ అన్నారు. పేదింటి ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మీ, షాదీముబారక్ పేరుతో 1 లక్ష 116 రూపాయలు అందించి ఆడబిడ్డల కాన్పుకు కేసిఆర్ కిట్టు పేరిట ఆడపిల్లకు 13 వేలు, మగ బిడ్డకు 12 వేలు ఇచ్చి న గొప్ప నాయకుడు కేసిఆర్ అన్నారు.
కరీంనగర్ నగరానికి స్మార్ట్ సిటీని ఇచ్చి నగర రూపురేఖలు మార్చుతున్న గొప్ప ముఖ్యమంత్రి కేసీఆర్ అని కొనియాడారు. నగరంలో ముఖ్యమంత్రి హామీ నిధుల నుండి మంత్రి గంగుల కమలాకర్, ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ వినోద్ కుమార్ లు 347 కోట్ల తెచ్చి నగర రోడ్లను సుందరీకరించడం జరిగిందన్నారు. మానేరు రివర్ ఫ్రంట్, కేబుల్ బ్రిడ్జ్ లాంటి ఎన్నో స్కీంలతో కరీంనగర్ ను ఒక పర్యాటక ప్రాంతంగా మార్చుతున్న నాయకులు ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ప్రజలంతా కేసిఆర్ పాలనను, చేస్తున్న సంక్షేమాన్ని విశ్వసిస్తున్నారన్నారు. మళ్ళీ కేసిఆర్ అధికారంలో ఉంటేనే మా బ్రతుకులు బాగుంటాయని, మా జీవితాలకు భరోసా ఉంటుందని ప్రజలంతా కోరుకుంటున్నారని అన్నారు.
కేసిఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం సస్యశ్యామలంగా ఉందని ప్రజలంతా హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో వచ్చే నెల నుండి ఇండ్లు లేని నిరుపేదలకు నివాస గృహాల నిర్మాణం కోసం ప్రభుత్వం 3 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించనుందని, ప్రతి నియోజకవర్గంలో వేల ఇండ్లకు సాయం అందిస్తుందన్నారు. ప్రజలందరికీ సకల సౌకర్యాలతో కూడు, గూడు, గుడ్డ, నీడ కల్పించి ప్రజల క్షేమం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ పరితపిస్తున్నారని తెలిపారు. ఢిల్లీ పాలకుల చేతులోకి తెలంగాణ రాష్ట్రం పోతే ఆగమై మళ్ళీ ఆంధ్ర పాలన వస్తుందని, అలాంటి పాలనకు ప్రజలు స్వస్తి పలకాలన్నారు. ప్రజల సంక్షేమం, తెలంగాణ అభివృద్ధిని ముందుకు నడిపిస్తున్న కేసిఆర్ ప్రభుత్వాన్ని మళ్ళీ అధికారంలోకి తెచ్చే వరకు గులాబీ సైన్యం నిద్రపోదన్నారు. ముచ్చటగా మూడో సారి బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని, ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన మళ్ళీ ఇలాగే కొనసాగించేలా ప్రతి గులాబీ సైనికుడు కృషి చేస్తారన్నారు.