తెలంగాణ ఉద్యమంలో న్యాయవాదుల పాత్ర కీలకమని, న్యాయవాదులకు ఇచ్చిన ప్రతి హామిని నెరవేర్చేందుకు కృషి చేస్తానని రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ జిల్లా కోర్టు ఆవరణలో 30 లక్షల రూపాయలతో నిర్మించనున్నడిజిటల్ లైబ్రరీ, పెండింగ్ పనుల నిధులను మంజూరు చేసి ఉత్తర్వులను బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఎర్రం రాజారెడ్డి, నాయకులకు మంత్రి గంగుల అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ న్యాయవాదుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. కరీంనగర్ లాయర్లకు ఇచ్చిన హామీ మేరకు నెల రోజుల్లో ఇళ్ళ స్థలాలు ఇప్పించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. కరీంనగరం అన్ని రంగాల్లో అభివృద్ది చెందాలని అందుకు మీ సహకారం కావాలని అన్నారు.
నన్ను నమ్మి గెలిపించిన ప్రజల రుణం తీర్చుకోవాలన్నదే నా తపన అని, ఇందుకోసం నగరాన్ని అభివృద్ది పథంలో తీసుకెళ్ళడమే ధ్యేయంగా కృషి చేస్తున్నానన్నారు. నేను తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కరీంనగర్ అభివృద్ది కోసం కోటి రూపాయలు ఇవ్వాలని నాటి ముఖ్య మంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని అడిగితే వెకిలి నవ్వులు నవ్వాడే తప్ప రూపాయి ఇచ్చిన పాపాన పోలేదన్నారు.
హామీలు ఇవ్వడం తనకు అలవాటు లేదని, చేసి చూపించడమే నా హాబీ అన్నారు మంత్రి. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సివిల్ సప్లై చైర్మన్ సర్దార్ రవీందర్ సింగ్, కరీంనగర్ మేయర్ సునీల్ రావు, బార్ అసోసియేషన్ నాయకులు పాల్గొన్నారు.