మహిళా దినోత్సవం రోజున సీఎం కేసీఆర్ మహిళలకు అందిస్తున్న మరో గొప్ప కానుక ఆరోగ్య మహిళ పథకం అని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. బుధవారం కరీంనగర్ పట్టణంలోని బుట్టి రాజారాం కాలనీ పట్టణ ఆరోగ్య కేంద్రంలో ఆరోగ్య మహిళ పథకంను లాంఛనంగా ప్రారంభించారు. మహిళల కష్టాలు తీర్చేందుకు అనేక పథకాలు తెచ్చిన ఘనత సీఎం కేసీఆర్ దని మిషన్ భగీరథ, ఆడపిల్లల కోసం రెసిడెన్షియల్ స్కూళ్లు ప్రారంభించామని, గర్భిణుల కోసం ఆరోగ్య లక్ష్మి పథకాన్ని అమలు చేస్తున్నామని, మహిళల రక్షణ కోసం షీ టీమ్స్, ఆడపిల్లల పెళ్లి కోసం కళ్యాణ లక్ష్మి పథకాలు చేపడుతున్నామన్నారు.
మహిళలు తాము పడుతున్న ఆరోగ్య సమస్యలు బయటకు చెప్పుకోవడానికి బిడియ పడుతుంటారని, కొందరు ఆర్థిక ఇబ్బందులు, ఆసుపత్రిలోని మగా డాక్టర్లకు సమస్యలు చెప్పుకోలేక హాస్పిటల్ కు వెళ్ళడమే మానేశారు అన్నారు. ఇలాంటి వారికోసమే ఆరోగ్య మహిళ పథకమని, ఇందులో మహిళలు సాధారణంగా ఎదుర్కొనే 8 రకాల వైద్య సేవలు అందుతాయని తెలిపారు. ఇకపై మహిళ వైద్యులతో, మహిళ సిబ్బందితో “ఆరోగ్య మహిళ” పేరుతో బుధవారం నుండి 100 ఆస్పత్రుల్లో ప్రారంభిస్తున్నామని తెలిపారు .
ఆసుపత్రిల సంఖ్యను దశలవారీగా పెంచుతానని, ప్రతి మంగళవారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు 100 ఆస్పత్రుల్లో మహిళల కోసం ప్రత్యేక పరీక్షలు చేసి మందులు, వైద్యం ఉచితంగా అందిస్తామన్నారు. తల్లి బాగుంటేనే కుటుంబం బాగుంటుందన్న ఆశయంతో ఈ పథకం ప్రారంభిస్తున్నామన్నారు. రాబోయే రోజుల్లో ఆరోగ్య మహిళ ఆస్పత్రుల సంఖ్య పెంచుతామని అన్నారు. మహిళలంతా తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా ప్రతి ఒక్కరూ వైద్య పరీక్షలు చేయించుకోవాలని ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఓ సర్వే ప్రకారం 40-50 శాతం మంది మహిళలు వివిధ రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారన్నారు. వ్యాధి తొలిదశలోనే గుర్తించి చికిత్స తీసుకోవాలన్నారు. శ్రీరామనవమి తర్వాత మహిళల కోసం న్యూట్రిషన్ కిట్ పథకం ప్రారంభిస్తున్నామని, ఇప్పటికే కేసీఆర్ కిట్ ప్రసవించిన మహిళకు ఇస్తున్నామన్నారు.