విధి నిర్వహణలో అందించిన సమర్థవంతమైన సేవలకు గాను కరీంనగర్ కమిషనరేట్ లోని నలుగురు పోలీసు అధికారులు వివిధ రకాల పథకాలను అందుకున్నారు. హైదరాబాద్ లోని రవీంద్రభారతిలో జరిగిన ఈ అవార్డుల ప్రధాన ఉత్సవ కార్యక్రమంలో రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమూద్ అలీ చేతుల మీదుగా ఈ పథకాలను అందుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి.
కరీంనగర్ రూరల్ సిఐ విజ్ఞాన్ రావు అతి ఉత్కృష్ట అవార్డును అందుకున్నారు. ఆయన 1998 లో ఎస్సైగా పోలీస్ శాఖలో చేరారు. 2014 లో సిఐగా పదోన్నతి పొందారు. 2018 లో సేవా పథకం అందుకున్నారు. శాఖా పరంగా ఇప్పటివరకు 45 రివార్డులు, 4 ప్రశంసా పత్రాలను అందుకున్నారు. సిటీ ఆర్మూర్ రిజర్వ్ విభాగం(సిఏఅర్)ఇన్స్పెక్టర్ (పరిపాలన) మోడెం సురేష్ కేంద్ర హోంశాఖ మంత్రి మెడల్ ను అందుకున్నారు. ఆయన ఆర్ఎస్ఐగా 2012లో పోలీస్ శాఖలో చేరారు. ఇప్పటివరకు ఆయన శాఖాపరంగా పలు రివార్డులు అవార్డులను పొందారు.
కరీంనగర్ లోని టూ టౌన్ పోలీస్ స్టేషన్ కు చెందిన హెడ్ కానిస్టేబుల్ తోడేటి శ్రీనివాస్ ఉత్తమ సేవ పతకాన్ని అందుకున్నారు. 1989 లో కానిస్టేబుల్ గా పోలీస్ శాఖలో చేరారు. ఇప్పటివరకు 100కు పైగా రివార్డులు 7 ప్రశంసా పత్రాలను అందుకున్నారు. సిటీ స్పెషల్ బ్రాంచ్ విభాగం (సిఎస్బి) లో పనిచేస్తున్న కానిస్టేబుల్ నాగమల్ల శ్రీనివాస్ ఉత్తమ సేవా పథకాన్ని అందుకున్నారు. 1996లో ఆయన పోలీస్ శాఖలో చేరారు. ఇప్పటివరకు 150కి పైగా రివార్డులు, 5 ప్రశంస పత్రాలను అందుకున్నారు.