ప్రజలు, కరీంనగర్ నగర పాలకవర్గ సభ్యుల సహకారం, పారిశుధ్య సిబ్బంది, కార్మికుల కృషి, అధికారులు, మెప్మా సిబ్బంది శ్రమ ఫలితంగా కరీంనగర్ నగరపాలక సంస్థకు మరో అవార్డు దక్కడం చాలా గర్వకారణమని కరీంనగర్ నగర మేయర్ యాదగిరి సునీల్ రావు, నగరపాలక సంస్థ కమిషనర్ సేవా ఇస్లావత్ లు అన్నారు.
స్వచ్చ్ సర్వేక్షణ్, పర్యావరణ పరిరక్షణ, మేరీ లైఫ్.. మేరా స్వచ్చ్ షెహర్.. లో భాగంగా కరీంనగర్ బల్దియా ఖాతాలో మరో అవార్డు చేరింది. తడి, పొడి చెత్త సేగ్రిగేషన్, పాత వస్తువుల సేకరణలో రెడ్యూజ్.. రీయూజ్.. రీసైకిల్.. ప్రక్రియను పకడ్భందిగా నిర్వహించడం, వాటిపై ప్రజల్లో అవగాహన పెంచడంపై కేంద్ర పట్టణాభివృద్ధి సంస్థ కరీంనగర్ నగరపాలక సంస్థకు అవార్డును ప్రకటించింది. ఈ నేపథ్యంలో టీఎస్ పీసీబి కార్యాలయం హైదరాబాద్ లోని సనత్ నగర్ లో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి చేతుల మీదుగా కరీంనగర్ నగర పాలక సంస్థ కమిషనర్ సేవా ఇస్లావత్ ఈ అవార్డును స్వీకరించారు. స్వచ్చతా కార్యక్రమాల్లో అవార్డులు కైవసం చేసుకుంటున్న కరీంనగర్ నగరపాలక సంస్థ అధికారులు, పాలకవర్గాన్ని మంత్రలు ప్రశంసిస్తూ ఇలాంటి అవార్డులు మరెన్నో పొందాలని అభినందించారు.
ఈ సందర్భంగా మేయర్ యాదగిరి సునీల్ రావు, కమిషనర్ సేవా ఇస్లావత్ లు మాట్లాడుతూ ఇదే స్పూర్తితో ప్రజలు, పాలకవర్గ సభ్యులు, అధికారులు, కార్మికుల సహకారంతో కరీంనగర్ నగర పారిశుద్ధ్యాన్ని మరింత మెరుగుపరిచేలా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వాలు ఇచ్చిన ప్రతి స్వచ్ఛతా పోటీల్లో కరీంనగర్ నగర పాలక సంస్థ పేరును ప్రథమ స్థానంలో నిలిపేలా, మరెన్నో అవార్డులు దక్కించుకునేలా కార్యక్రమాలను చేపడతామన్నారు. పారిశుద్ధ్యాన్ని మెరుగుపరుస్తూ, ప్లాస్టిక్ ను నివారిస్తూ, రెడ్యూజ్ రీయూజ్, రీసైకిల్ ప్రక్రియను నిరంతరంగా కొనసాగిస్తామన్నారు. నగర ప్రజలకు భవిష్యత్తులో డంపుయార్డు అనేది కనబడకుండా నగరపాలక సంస్థ కార్యక్రమాలు ఉంటాయని, రాష్ట్రంతో పాటు దేశంలో కరీంనగర్ నగరాన్ని స్వచ్చ మైన పరిశుభ్రమైన నగరంగా మార్చుతామన్నారు. లక్ష పైబడిన నగరాల స్వచ్ఛతలో కరీంనగర్ బల్దియాకు అవార్డు దక్కడం చాలా గర్వకారణం అన్నారు.
ఈ అవార్డు ప్రదానోత్సవంలో ఆర్.టీ.డీ. సీఎస్ రాజీవ్ శర్మ, సీఎస్ రజత్ కుమార్, టీఎస్పీసీబీ సెక్రటరీ నీతూ ప్రసాద్, ఈ.పి.టీ.ఆర్.ఐ. డైరెక్టర్ జనరల్ వాణీ ప్రసాద్, నగరపాలక సంస్థ ఎన్విరాల్ మెంట్ ఇంజనీర్ స్వామి, సానిటేషన్ సూపర్ వైజర్ రాజమనోహర్ తదితరులు పాల్గొన్నారు.