Friday, September 20, 2024
HomeతెలంగాణKarimnagar: కొత్త నిర్మాణాలకు పాత అనుమతులా?

Karimnagar: కొత్త నిర్మాణాలకు పాత అనుమతులా?

గుడ్డి గుర్రాలకు పళ్ళు తోముతున్న అధికార యంత్రాంగం

వడ్డించే వాడే మనవాడైతే బంతిలో ఎక్కడ కూర్చున్నా సరిపోతుంది అనే సామెతను అక్షరాల నిజం చేసి చూపిస్తున్నారు కరీంనగర్ జిల్లా అధికారులు. కొత్తగా నిర్మాణం చేపడుతున్న ఇండ్లకు సైతం పాత తేదీలలో అనుమతులు తీసుకున్నట్లు చూపిస్తూ ప్రభుత్వా ఆదాయానికి భారీగా గండి కొడుతున్నప్పటికీ సంబంధిత శాఖ అధికారులు నిమ్మకు నీరెత్తన్నట్లు వ్యవహరిస్తుండడం పలు విమర్శలకు తావిస్తోంది. గ్రామ పంచాయతీ నగరపాలక సంస్థలో విలీనమై నాలుగు సంవత్సరాలు గడిచినప్పటికీ గ్రామ పంచాయతీ సమయంలోనే అనుమతులు తీసుకున్నట్లు పత్రాలను సృష్టిస్తూ అక్రమాలకు పాల్పడుతున్న వారి ఆగడాలకు అడ్డూ అదుపూ లేకుండా పోవడం విస్మయాన్ని కలిగిస్తోంది.

- Advertisement -

వివరాల్లోకి వెళితే కరీంనగర్ పట్టణానికి కూతవేటు దూరంలో ఉండే రేకుర్తి గ్రామపంచాయతీ 2018 సంవత్సరంలో కరీంనగర్ నగరపాలక సంస్థలో విలీనం అయింది. ఆ సమయంలో విద్యుత్ శాఖ, రెవెన్యూ శాఖ, గ్రామ పంచాయతీ అధికారులు కుమ్మక్కై అక్రమార్జనకు తెరలేపారు. ప్రభుత్వ భూములలో సైతం ఇంటి నెంబర్లను మంజూరు చేశారు. వారికి బలం చేకూర్చే విధంగా ఇంటి నెంబర్ల ఆధారంగా ఎలాంటి ఇంటి నిర్మాణాలు చేపట్టనప్పటికీ విద్యుత్ శాఖ అధికారులు విద్యుత్ మీటర్లను సైతం మంజూరు చేయడం చూస్తుంటే వారు ఏ స్థాయిలో అవినీతి అక్రమాలకు పాల్పడ్డారో అర్థమవుతుంది. ప్రస్తుతం అట్టి భూములలో ఎలాంటి అనుమతులు తీసుకోకుండా పాత అనుమతుల పేరుతోనే కొత్తగా బహుళ అంతస్తులను నిర్మిస్తుండడం జరుగుతున్నప్పటికీ సంబంధిత అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తుండడం చూస్తుంటే ఏ స్థాయిలో ముడుపులు ముట్టాయో అర్థం చేసుకోవచ్చు.

✍️ కంచె చేను మేస్తున్న అధికారులు మాత్రం గుడ్డి గుర్రాలకు పళ్ళు తోముతున్న వైనం…
ప్రభుత్వ ఆదాయానికి గండి పడకుండా కాపాడవలసిన అధికారులే తమకు ఎందుకులే అన్నట్లు వ్యవహరిస్తుండడం పలు అనుమానాలకు తావిస్తుంది. ఎలాంటి ఇండ్ల నిర్మాణం చేపట్టినప్పటికీ సుమారు 142 విద్యుత్ మీటర్లను మంజూరు చేసిన విద్యుత్ శాఖ అధికారులు ఆ శాఖలో పనిచేస్తున్న ఒక అధికారి అక్రమంగా బహుళ అంతస్తు నిర్మాణం చేపడుతుండడం చూస్తుంటే అతనికి ఆ సంస్థలో ఉన్న పలుకుబడి ఏంటో అర్థం చేసుకోవచ్చు. తాము ఆడింది ఆట పాడింది పాటగా వ్యవహరించిన అధికారుల అక్రమ సంపాదన పై పూర్తిస్థాయిలో విచారణ జరిపించాలని పలుమార్లు ఉన్నతాధికారులకు సైతం ఫిర్యాదులు వెళ్లాయి. అయినప్పటికీ వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఉండడంలో ఆంతర్యమేంటో ఎవరికి అర్థం కాని ప్రశ్నగా మిగిలిపోయింది. గ్రామ పంచాయతీగా ఉన్న సమయంలో ఇద్దరు కార్యదర్శులు ఇబ్బడి ముబ్బడిగా ఇండ్ల నిర్మాణాలకు అనుమతులు ఇవ్వడంతో విద్యుత్ శాఖ అధికారులు సైతం విద్యుత్ మీటర్లను మంజూరు చేయడం చూస్తుంటే ఏ స్థాయిలో డబ్బులు చేతులు మారాయోనని చర్చ జోరుగా సాగుతోంది.

అక్రమ విద్యుత్ మీటర్ల మంజూరుపై రూరల్ ఏడిని వివరణ కోరేందుకు తెలుగుప్రభ కరీంనగర్ ప్రతినిధి ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాకపోవడం చూస్తుంటే విద్యుత్ శాఖ అధికారులు ఏ స్థాయిలో అక్రమాలకు పాల్పడ్డారో ఇట్టే అర్థమవుతుంది. ఇప్పటికైనా జిల్లా స్థాయి అధికారులు స్పందించి కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలోని (రేకుర్తి) 18, 19 డివిజన్లలో నిర్మాణం చేపడుతున్న అక్రమ కట్టడాలపై, విద్యుత్ మీటర్ల మంజూరుపై పూర్తిస్థాయిలో విచారణ చేపడితే ఏ స్థాయిలో అవినీతి అక్రమాలు జరిగాయో వెలుగు చూసే అవకాశం ఉందని స్థానిక ప్రజలు ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నారు. రేకుర్తిలో జరిగిన అవినీతి అక్రమాలపై జిల్లా స్థాయి ఉన్నత అధికారులు ఏ మేరకు స్పందిస్తారో వేచిచూడాలి మరి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News