Friday, November 22, 2024
HomeతెలంగాణKarimnagar: గ్రామాల అభివృద్ధిలో కానరాని ప్రత్యేక అధికారుల పాత్ర

Karimnagar: గ్రామాల అభివృద్ధిలో కానరాని ప్రత్యేక అధికారుల పాత్ర

ప్రత్యేక అధికారుల పాలనలో తిరోగమన దిశలో గ్రామాలు

ఐదు నెలల క్రితం గ్రామ పంచాయితీ పాలకవర్గం పదవీ కాలం ముగియడంతో అప్పట్లో పంచాయితీ ఎన్నికలు పెట్టే ఆలోచన లేని రాష్ట్ర ప్రభుత్వం పంచాయితీ పాలనా వ్యవహారాలు చక్కబెట్టెందుకు ప్రత్యేక అధికారుల విధానాన్ని తెరపైకి తెచ్చి పంచాయితీలకు ఒక ప్రత్యేక అధికారిని నియమించింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పలువురు సర్పంచ్ లు తమ పదవి కాలంలో లోకల్ పాలిటిక్స్ తో అభివృద్ధికి అవసరమైన పనులు చేయలేక, చేసినా బిల్లులు వస్తాయో లేదోనని రకరకాల కారణాలతో తాము ఇబ్బంది పడుతూ ప్రజలను కూడా ఇబ్బందులకు గురిచేశారు.

- Advertisement -

ప్రత్యేక అధికారుల పాలన వచ్చాక ఎలాంటి వివక్ష లేకుండా గ్రామాలు అభివుద్ది బాట పడతాయని అందరూ భావించారు. కానీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా గ్రామాల అభివృద్దిలో ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రత్యేక అధికారుల మార్క్ ఎక్కడా కనిపించడం లేదని వారు గ్రామాలకు వచ్చేది లేదు, వచ్చినా చేసేదేమీ లేదని ఆయా గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు.
👉 మండల స్థాయిలో బిజీగా ఉండడమే కారణం…
మండల స్థాయిలో బిజీగా ఉంటూ గ్రామ పాలనపై కనీస అవగాహన లేని వివిధ హోదాల్లో ఉన్న అధికారులను గ్రామాలకు ప్రత్యేక అధికారిగా నియమించడం వల్ల వారివారి విధులు నిర్వహిస్తూ గ్రామాల మీద సరైన దృష్టి సారించలేకపోవడంతో పంచాయితీల పాలన పూర్తిగా కుంటుపడుతుందని ప్రజలు వాపోతున్నారు. గ్రామాభివృద్ధి, స్థానిక ప్రజా సమస్యలపై ప్రత్యేక అధికారికి విన్నవించినా ఫలితం లేకుండా పోయిందని, ఏది ఆడిగినా కార్యదర్శికి చెప్పండని సమాధానం వస్తుందని దీనితో కార్యదర్శులే అన్ని తామై నడిపిస్తున్నారని ఈ మాత్రం దానికి ప్రత్యేక అధికారి దేనికని ప్రశ్నిస్తున్నారు.


మండల స్థాయి అధికారులను స్పెషల్ ఆఫీసర్స్ గా నియమించడం ద్వారా వారి అసలు పనిపై దృష్టి పెట్టలేక, గ్రామాల సమస్యలపై ఫోకస్ చేయలేక పని భారంతో ఇబ్బంది పడుతూ రెంటికీ చెడ్డ రేవడిలా తమ పరిస్థితి మారిందని పలువురు ప్రత్యేక అధికారులు ఎవరికీ చెప్పుకోలేక లోలోన మదనపడుతున్నారు.
👉పాలన ఇలాగే కొనసాగితే గ్రామాలు పూర్తిగా నిర్వీర్యం అయ్యే ప్రమాదం…
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ ఎన్నికల నిర్వహణపై స్పష్టమైన నిర్ణయానికి రాకపోవడంతో ప్రస్తుతానికి ఎన్నికల నిర్వహణ కనుచూపు మేరలో కనిపించడం లేదు. పంచాయితీ పాలన ఇలాగే కొనసాగితే గ్రామాలు పూర్తిగా నిర్వీర్యం అయ్యే ప్రమాదం ఉందని, అంతగా పని భారం లేని అధికారులను గుర్తించి, వారికి గ్రామాల పట్ల కనీస అవగాహన కల్పించి, స్పెషల్ ఆఫీసర్లుగా నియమిస్తే కొంతమేరకు ఉపయుక్తంగా ఉంటుందని, పంచాయతీలను, ప్రజలను కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని మేధావులు, సామాజికవేత్తలు కోరుతున్నారు. దీనిపై ఉన్నతాధికారులు ఏ మేరకు స్పందిస్తారో వేచి చూద్దాం…

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News