Thursday, July 4, 2024
HomeతెలంగాణKarimnagar: శ్రీ చైతన్య కాలేజ్ హాస్టల్ ఫుడ్ పాయిజన్ పై చర్యలు ఉంటాయా?

Karimnagar: శ్రీ చైతన్య కాలేజ్ హాస్టల్ ఫుడ్ పాయిజన్ పై చర్యలు ఉంటాయా?

డబ్బుపై ఉన్న శ్రద్ధ పిల్లల ప్రాణాలపై లేదా?

కరీంనగర్ జిల్లా కేంద్రంలోని శ్రీ చైతన్య కళాశాల వసతి గృహంలో ఆదివారం ఉదయం ఫుడ్ పాయిజన్ కావడంతో పలువురు విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురైన విషయం విధితమే. ప్రైవేట్ కళాశాలలో నాణ్యమైన విద్య అందిస్తారని ఎంతో నమ్మకంతో గ్రామీణ ప్రాంతాల విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం లక్షలు వెచ్చిస్తూ ప్రైవేట్ హాస్టల్లో చేర్పించడం ఈ మధ్యకాలంలో ఎక్కువగా జరుగుతుంది. కానీ హాస్టల్లో సౌకర్యాలపై దృష్టి సారించకపోవడంతో కళాశాలల యాజమాన్యం విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. సంబంధిత అధికారుల పర్యవేక్షణ లేకపోవడం కూడా హాస్టల్ నిర్వాహకులకు కలిసి వస్తుంది. లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్న కళాశాల యాజమాన్యాలు అదే స్థాయిలో విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించకపోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

- Advertisement -

శ్రీ చైతన్య కళాశాల యాజమాన్యం నిర్లక్ష్యంతో విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురి కావడం చూస్తుంటే ప్రైవేట్ వసతి గృహాలలో విద్యార్థులకు ఎలాంటి భోజన వసతి కల్పిస్తున్నారో అర్థమవుతుంది. కరీంనగర్ నగరంలో విచ్చలవిడిగా ప్రైవేట్ హాస్టళ్లను ఏర్పాటు చేస్తున్నారు. హాస్టల్లో వసతులను పర్యవేక్షించే అధికారులే లేకపోవడంతో నిర్వాహకులు విద్యార్థుల ఆరోగ్యంపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రైవేటు హాస్టల్లో నిర్వాహకులు ప్రభుత్వ నిబంధనలు పాటించడం లేదని శ్రీ చైతన్య కాలేజీలో ఆదివారం జరిగిన సంఘటన ఉదాహరణగా చెప్పవచ్చు.

లక్షలాది రూపాయల ఫీజులు వసూలు చేస్తూ ప్రైవేట్ కళాశాలలో తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని వీరిని నియంత్రించడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారని విద్యార్థి సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీసం నెలకు ఒకసారి అయినా ఫుడ్ అధికారులు, మున్సిపల్ అధికారులు వసతి గృహాలను సందర్శిస్తే పరిస్థితి కొంత మెరుగుపడే అవకాశం ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఏ మేరకు దీనిపై సంబంధిత అధికారులు స్పందిస్తారో వేచి చూద్దాం.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News