యోగాతో ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని, యోగాసనాల ద్వారా శారీరక, మానసిక రుగ్మతలను తొలగించుకోవచ్చని కరీంనగర్ నగర మేయర్ యాదగిరి సునీల్ రావు అన్నారు. కరీంనగర్ లోని 33వ డివిజన్ భగత్ నగర్ క్యాంపు కార్యాలయంలో శ్రీ రామచంద్ర మిషన్, కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖల ఆధ్వర్యంలో మే 5, 6, 7 వ తేదీల్లో నిర్వహించే హర్ దిల్ ద్యాన్, హర్ దిన్ ధ్యాస్ యోగా మహోత్సవ పోస్టర్ ను మేయర్ సునీల్ రావు ఆవిష్కరించారు. శ్రీ రామచంద్ర మిషన్ సభ్యులు యోగా మహోత్సవ ప్రారంభ కార్యామానికి ముఖ్య అతిథిగా హాజరుకావాలని మేయర్ యాదగిరి సునీల్ రావుకు నిర్వాహకులు ఆహ్వాన పత్రిక అందజేశారు. ఈ సందర్భంగా మేయర్ సునీల్ రావు మాట్లాడుతూ బిపి, మధుమేహం, ఒత్తిడి, ఊబకాయం, థైరాయిడ్ లతో బాధపడే వారు యోగా మహోత్సవంలో 3 రోజుల పాటు ఉచితంగా ఇచ్చే శిక్షణలో ఆసనాలు, ప్రాణాయామం, ముద్రలు, ధ్యానం మెలుకువలు నేర్చుకొని అనారోగ్య సమస్యలకు ఉపశమనం కలిగించుకోవాలని సూచించారు. యోగాసనాలు, ముద్రలు, ధ్యానం మనిషిలోని రక్తప్రసరణను మెరుగుపరిచి ఆక్సిజన్ లెవల్స్ ను శరీరానికి అందించడంలో ముఖ్యపాత్ర పోషిస్తాయన్నారు. తద్వారా ప్రతి రోజు వీటిని పాటిస్తే ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయన్నారు. ప్రజలు యోగా మహోత్సవానికి పెద్ద సంఖ్యలో హాజరై తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని మేయర్ సునీల్ రావు పిలుపునిచ్చారు.