BRS Party: టీఆర్ఎస్ అధికారికంగా బీఆర్ఎస్ గా మారింది. ఇప్పటికే కొత్త పార్టీ జెండా ఆవిష్కరించిన సీఎం కేసీఆర్ తరుపరి కార్యాచరణపైనా ఫోకస్ పెట్టారు. తమ పార్టీ ముఖ్య నేతలతో భవిష్యత్ కార్యాచరణ ఖరారు పైన చర్చలు చేస్తున్న కేసీఆర్.. ఢిల్లీ నుండి పార్టీ కార్యకలాపాల కోసం త్వరలోనే అక్కడ పార్టీ జాతీయ కార్యాలయ ఏర్పాట్లను స్పీడప్ చేస్తున్నారు. ఇప్పటికే ఢిల్లీలోని సర్ధార్ పటేల్ మార్గ్ లో పార్టీ కేంద్ర కార్యాలయం నిర్మాణం జరుగుతుండగా సాధ్యమైనంత త్వరగా దాన్ని ప్రారంభించాలని చూస్తున్నారు.
ఇక, ఆప్ కీ బార్ కిసాన్ సర్కార్ నినాదంతో బీఆర్ఎస్ ముందుకు వెళ్తుందని చెప్పిన కేసీఆర్.. ఢిల్లీ ఎర్రకోటపై గులాబీ జెండా ఎగరడమే తన లక్ష్యంగా వెల్లడించారు. అయితే, బీఆర్ఎస్ తక్షణం పోటీ చేసే రాష్ట్రాలపైనే ఇప్పుడు రాజకీయ వర్గాలలో చర్చ నడుస్తుంది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలతోనే భారత రాష్ట్ర సమితి రాజకీయ ప్రస్థానం ప్రారంభం అవుతుందని కేసీఆర్ చెప్పినట్లుగా మీడియాలో ప్రచారం జరుగుతుంది. పార్టీ ఆవిర్భావం సందర్భంగా తెలంగాణ భవన్‌లో జరిగిన సమావేశంలో కేసీఆర్ ఈ విషయాన్ని వెల్లడించినట్లు సారాంశం.
అయితే.. బీఆర్ఎస్ జాతీయ రాజకీయాలు కర్ణాటక నుండే మొదలవుతాయా? అంటే పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే.. కేసీఆర్ టార్గెట్ జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలని స్పష్టమైన విషయమే. నాలుగు నెలలలో కర్ణాటకలో ఎన్నికలు రానున్నాయి. ప్రస్తుతం అక్కడ ఉంది బీజేపీ ప్రభుత్వం. సో.. రేపు బీఆర్ఎస్ అక్కడ పోటీచేస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలే ప్రమాదం ఉంది. కేసీఆర్ ఆలోచన కుమారస్వామి మళ్ళీ అక్కడ సీఎం కావాలన్నదేనని ఆయనే స్వయంగా చెప్పుకొచ్చారు.
పైగా నాలుగు నెలలలోనే ఇతర రాష్ట్రాలలో పోటీ చేయడం అంటే ఆషామాషీ విషయం కాదు. గుల్బర్గా నుంచి బీదర్ వరకు ఏడు జిల్లాల్లో బీఆర్ఎస్ పోటీ చేయనుందని కేసీఆర్ చెప్పినట్లుగా మీడియాలో కథనాలొచ్చాయి. అయితే.. బీఆర్ఎస్ సింగిల్ గా పోటీ చేస్తే బీజేపీకి లాభం చేకూరే ఛాన్స్ లేకపోలేదు. ఒకవేళ జనతా దళ్ తో పొత్తుతో ఎన్నికలకు వెళ్లాలని అనుకుంటే.. కుమారస్వామి సీట్లను వదులుకోవాలి. అందుకు ఆ పార్టీ సిద్ధంగా ఉందా అన్నది చూడాలి. ఒకవేళ తక్కువ సమయం ఉండడం.. బీజేపీకి లాభం చేకూర్చడం ఇష్టంలేకపోతే ఈసారికి బీఆర్ఎస్ జనతాదళ్ కి మద్దతు ప్రకటించి ఎన్నికలకు దూరంగా ఉంటుందా అన్న చర్చలు కూడా సాగుతున్నాయి. మరి ఏమవుతుందో.. బీఆర్ఎస్ అడుగులు ఎలా ఉంటాయో చూడాల్సి ఉంది.