Saturday, November 15, 2025
HomeTop StoriesKarthika Masam: భక్తులకు గుడ్‌న్యూస్‌.. కార్తిక మాసంలో ఈ తేదీల్లో ప్రత్యేక బస్సులు

Karthika Masam: భక్తులకు గుడ్‌న్యూస్‌.. కార్తిక మాసంలో ఈ తేదీల్లో ప్రత్యేక బస్సులు

Karthika Masam Special Buses: పరమేశ్వరుడికి అత్యంత ప్రీతికరమైన, హిందువులు అతి పవిత్రంగా భావించే కార్తిక మాసంలో శైవ క్షేత్రాలకు భక్తుల తాకిడి అధికంగా ఉంటుంది. కార్తిక స్నానాలాచరించి, నిత్యం శివన్నామస్మరణతో భక్తులు పరవశించిపోతారు. ఈ నేపథ్యంలో పరమేశ్వరుడికి ఆలయాలకు భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని టీజీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక చర్యలు చేపట్టింది. 

- Advertisement -

కార్తిక మాసంలోని ప్రతి సోమవారం శైవ క్షేత్రాలను దర్శించుకునేందుకు వీలుగా ప్రతి ఆదివారం ఉమ్మడి నల్గొండ జిల్లాలోని డిపో కేంద్రాల నుంచి ప్రత్యేక బస్సులు నడవనున్నాయి. తిరిగి మంగళవారం డిపోలకు చేరుతాయని టీజీఎస్‌ఆర్టీసీ పేర్కొంది. భక్తుల సౌకర్యార్థం ఈ నిర్ణయం తీసుకున్న తెలంగాణ రవాణా సంస్థ.. ఇప్పటికే ప్రణాళికను సిద్ధం చేసింది. ఈ నెల 26, నవంబర్‌ 2, 4, 9, 16 తేదీల్లో ప్రత్యేక బస్సులు నడిపేలా చర్యలు చేపట్టింది. నవంబర్‌ 5న కార్తిక పౌర్ణమి నేపథ్యంలో 4వ తేదీ కూడా సర్వీసులు అందిస్తుంది. 

Also Read: https://teluguprabha.net/political-news/kalvakuntla-kavitha-sensational-comments-on-brs-leaders/

సూర్యాపేట డిపో నుంచి ప్రతి రోజు ఉదయం 6 గంటలకు వేములవాడకు, ఉదయం 5.00, 9.30 గంటలకు శ్రీశైలానికి ప్రత్యేక బస్సులు నడుస్తున్నాయని నల్గొండ రీజనల్‌ డిపో అధికారులు వెల్లడించారు. సూర్యాపేట డిపో నుంచి నాలుగు జ్యోతిర్లింగాలు (ఘృష్నేశ్వర్, నాసిక్, భీమేశ్వర్, త్రయంబకేశ్వర్‌), షిర్డీలను కలుపుతూ మొత్తం 11 యాత్రా స్థలాల దర్శనానికి ప్రత్యేక బస్సు(సూపర్‌ లగ్జరీ) టీజీఎస్‌ఆర్టీసీ నడపనుంది. ఐదు రోజుల పాటు సాగనున్న ఈ యాత్రా బస్సుకు ఛార్జీల వివరాలు చూస్తే.. పెద్దలకు రూ.6,500, పిల్లలకు రూ.4,500గా నిర్ణయించింది.

ఈ అద్భుతమైన అవరాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని భక్తులకు నల్గొండ ఆర్టీసీ రీజనల్​ మేనేజర్​ కొణతం జాన్​రెడ్డి సూచించారు. ప్రత్యేక బస్సులతో పాటు మిగతా సర్వీసులు యథావిధిగా నడుస్తాయని తెలిపారు. ప్రయాణికులు కోరినట్లయితే అద్దె ప్రాతిపదికన సైతం బస్సులు నడిపేందుకు  సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. 

ఇక హైదరాబాద్‌లోని దుండిగల్ నుంచి కూడా ప్రత్యేక బస్సులు నడవనున్నాయి. అరుణాచలం, వేములవాడ, శ్రీశైలం వంటి వివిధ పుణ్య క్షేత్రాలకు ప్రత్యేక బస్సులను నడపనున్నారు. ప్రత్యేక టూర్‌ ప్యాకేజ్‌లను ఆర్టీసీ అందిస్తోంది. 

అరుణాచలం టూర్ ప్యాకేజ్‌లో అరుణా చలం, కాణిపాకం, గోల్డెన్ టెంపుల్, కంచి క్షేత్రాలను దర్శించవచ్చు. ఈ యాత్ర మూడు రోజుల్లో ముగుస్తుంది. ఈ ప్యాకేజ్‌కు ఛార్జీలు పెద్దలకు రూ. 4500, పిల్లలకు రూ. 2400గా ఆర్టీసీ నిర్ణయించింది.

Also Read: https://teluguprabha.net/telangana-news/cp-vc-sajjanar-alert-on-cyber-crimes-in-whatsapp/

శ్రీశైలం టూర్ ప్యాకేజ్‌లో మైసిగండి, శ్రీశైలం డ్యామ్, శిఖరం శ్రీశైలం క్షేత్రాల్లో పరమేశ్వరుడి దర్శన భాగ్యం చేసుకోవచ్చు. ఈ టూర్‌ ఒక్క రోజు మాత్రమే. ఈ ప్యాకేజ్‌కు ఛార్జీలు పెద్దలకు రూ. 1500, పిల్లలకు రూ. 900 చెల్లించాలి.

విజయవాడ టూర్ ప్యాకేజ్‌లో చెరువుగట్టు, విజయవాడ దుర్గమ్మ గుడిని దర్శించుకోవచ్చు. ఈ ఒక్క రోజు టూర్ ప్యాకేజ్‌కు ఛార్జీలు పెద్దలకు రూ. 1500, పిల్లలకు రూ. 850.

వేములవాడ టూర్ ప్యాకేజ్లో ధర్మపురి, కొండగట్టు, వేములవాడ దర్శనాలు ఉంటాయి. ఛార్జీలు పెద్దలకు రూ. 1200, పిల్లలకు రూ. 650.

జోగులాంబ, మంత్రాలయం టూర్ ప్యాకేజ్లో జోగులాంబ అమ్మవారి దర్శనం, కూలబ్రహ్మేశ్వర స్వామిగుడి, పురాతన శివాలయం, బీచ్‌పల్లి హనుమాన్ టెంపుల్, రాఘవేంద్రస్వామి వేంకటేశ్వర స్వామి ఆలయాలను దర్శించుకోవచ్చు. ఈ ఒక్క రోజు టూర్‌ ప్యాకేజ్‌లో ఛార్జీలు పెద్దలకు రూ. 1950, పిల్లలకు రూ. 700 గా ఉంది. ఇతర ప్యాకేజ్‌లు కూడా ఉన్నాయని మరింత సమాచారం కోసం 9958226150, 7671014280, 9866283555 ఫోన్ నెంబర్లలో సంప్రదించాలని అధికారులు సూచించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad