విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో రాష్ట్రంలో సకాలంలో వర్షాలు కురిసి పాడి పంటలు సమృద్ధిగా పండాలని, రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని రాష్ట్ర ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి వినాయక మండపాల వద్ద విఘ్నేశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని ధర్మారం, రామన్నపల్లి, కొత్తపల్లి, ఆబాది జమ్మికుంటలో ఏర్పాటు చేసిన సుమారు 68 వినాయక మండపాలను బుధవారం ఆయన మున్సిపల్ చైర్మన్ తక్కల్లపల్లి రాజేశ్వరరావుతో కలిసి దర్శించుకున్నారు.
నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకునేందుకు ప్రతి మండపం వద్ద తన వంతు ఆర్థిక చేయూతగా రూ,5వేలను మండపాల నిర్వహకులకు అందజేశారు. ఈ సందర్భంగా కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ… ప్రజలందరూ శాంతియుత వాతావరణంలో భక్తిశ్రద్ధలతో వినాయక నవరాత్రి ఉత్సవాలను జరుపుకోవాలని కోరారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో రాష్ట్రంలోని ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉన్నారని, ఆ విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు సుపరిపాలన అందిస్తూ రాష్ట్రాన్ని దేశంలోనే అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో మొదటి స్థానంలో నిలిపారని గుర్తు చేశారు.
పోలీస్, విద్యుత్, మున్సిపల్ శాఖల అధికారుల సూచనలు పాటిస్తూ నవరాత్రి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించుకోవాలని వినాయక మండపాల నిర్వాహకులు సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ దేశిని స్వప్నకోటి, కౌన్సిలర్లు బొంగోని వీరన్న, మారపల్లి బిక్షపతి, గాజుల భాస్కర్, శ్రీపతి నరేష్ గౌడ్, కల్వల దీప్తి కిషన్ రెడ్డి, దేశిని రాధా సదానందం, బిఆర్ఎస్ నాయకులు, వినాయక మండపాల నిర్వాహకులు, భక్తులు పాల్గొన్నారు.