రాష్ట్ర ప్రజలందరూ సన్మార్గంలో కలిసి మెలిసి నడవాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. జమ్మికుంట పట్టణంలోని పద్మశాలి భవన్ లో స్వర్ణకారుల సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శ్రీ విశ్వకర్మ యజ్ఞ మహోత్సవ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ… సృష్టికి మూలం విశ్వకర్మ అని విశ్వకర్మ భగవానుడి చల్లని చూపులతో సకల జనులు సుఖ సంతోషాలతో ఉండాలనేది ప్రభుత్వ ధ్యేయమని అన్నారు. ప్రజలందరూ దైవిక కార్యక్రమాలను నిర్వహించాలని దైవ కార్యక్రమాలతో క్రమశిక్షణ పెరుగుతుందని ప్రజలందరూ సన్మార్గంలో నడిచేలా ఆధ్యాత్మికతను పెంపొందించుకునేందుకు ప్రయత్నం చేయాలని అన్నారు. అత్యాధునిక మిషన్లు రావడంతో కుల వృత్తుల వారు ఇబ్బందులు పడుతున్నారని వారందరికీ అండగా రాష్ట్ర ప్రభుత్వం ఉంటుందని బీసీల సంక్షేమమే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని ఎమ్మెల్సీ అన్నారు. అనంతరం శ్రీ విశ్వకర్మ యజ్ఞ మహోత్స కార్యక్రమంలో భాగంగా స్వర్ణకారులు హోమాలు ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కల్లపల్లి రాజేశ్వరరావు, కౌన్సిలర్ గాజుల భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.