ముఖ్యమంత్రి కేసీఆర్ రైతాంగ సంక్షేమానికి అహర్నిశలు కృషి చేస్తున్నాడని, అందులో భాగంగానే వ్యవసాయ రంగానికి 24 గంటలు ఉచిత విద్యుత్తు ఇస్తున్నారని, కానీ కాంగ్రెస్ పార్టీ అందుకు విరుద్ధంగా ఉచిత విద్యుత్తును రద్దు చేయాలనే దుర్మార్గపు ఆలోచన చేస్తుందని రాష్ట్ర ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ పార్టీ హుజురాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ పాడి కౌశిక్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఉచిత విద్యుత్తు అవసరం లేదంటూ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చేసిన ప్రకటన నేపథ్యంలో, కాంగ్రెస్ పార్టీ వ్యవసాయ రైతు వ్యతిరేక ఆలోచనా విధానాన్ని నిరసిస్తూ హుజురాబాద్ నియోజకవర్గం వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు ప్రతి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ దిష్టిబొమ్మలను దహనం చేస్తామన్నారు.
గతంలో కూడా విద్యుత్ ఇవ్వకుండా రైతులను గోసపెట్టిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది అని మండిపడ్డారు. మరోసారి రైతు వ్యతిరేక విధానాలను కాంగ్రెస్ పార్టీ బయటపెట్టుకుందన్నారు. కాంగ్రెస్ పార్టీ రైతు వ్యతిరేక విధానాన్ని తెలంగాణ రైతాంగం, ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించాల్సిన అవసరం ఉందన్నారు.