ముఖ్యమంత్రి కేసీఆర్ కార్యదక్షత, దూరదృష్టితో సాగునీటి రంగంలో నవశకం ప్రారంభమైందని, తెలంగాణ జల మాగాణంగా మారిందని, పాతాళ గంగమ్మ పైపైకి ఎగిసి వస్తుందని రాష్ట్ర ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ, బిఆర్ఎస్ పార్టీ హుజురాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా జమ్మికుంట పట్టణంలోని స్వాతి గార్డెన్ లో నియోజకవర్గస్థాయి ప్రజాప్రతినిధులు, సాగునీటిపారుదల శాఖ అధికారులతో నిర్వహించిన సాగునీటి దినోత్సవం కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ అపర భగీరథుడుగా మారి 20 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుతో పాటు మరో 20 లక్షల ఎకరాలకు సాగునీరును అందించడానికి నిర్మాణం చేపట్టిన కాలేశ్వరం ప్రాజెక్టు దేశ చరిత్రలోనే ఓ అపూర్వ ఘట్టమన్నారు. ఒకనాడు చుక్క నీటి కోసం అలమటించిన తెలంగాణ ఇప్పుడు 20కి పైగా రిజర్వాయర్లతో పూర్ణ కలశం వలె తొణికిసలాడుతుందన్నారు. మన తెలంగాణ దేశానికే అన్నం పెట్టే అన్నపూర్ణగా విలసిల్లుతుందని అభివర్ణించారు.
ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కల్లపల్లి రాజేశ్వరరావు, వైస్ చైర్ పర్సన్ దేశిని స్వప్న కోటి, కేడీసీసీ వైస్ చైర్మన్ పింగిలి రమేష్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గరీమ అగర్వాల్, ఏసీపీ వెంకట్ రెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ పొనగంటి సంపత్, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు వెంకటరెడ్డి, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షురాలు కడవెరుగు మమత, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.