Tuesday, September 24, 2024
HomeతెలంగాణKaushik Reddy: తెలంగాణ ప్రగతికి పట్టు కొమ్మలు

Kaushik Reddy: తెలంగాణ ప్రగతికి పట్టు కొమ్మలు

దేశంలో ఎక్కడాలేని మౌలిక సదుపాయాలు తెలంగాణ పల్లెల్లో..

గ్రామాలు తెలంగాణ ప్రగతికి పట్టు కొమ్మలుగా మారాయని పల్లె ప్రగతితో గ్రామీణ ప్రాంతాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని రాష్ట్ర ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గురువారం పల్లె ప్రగతి దినోత్సవాన్ని హుజురాబాద్ నియోజకవర్గంలో గ్రామ గ్రామాన ఘనంగా జరుపుకున్నారు. నియోజకవర్గంలోని పలు గ్రామాలలో నిర్వహించిన పల్లె ప్రగతి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ నాడు నీళ్లులేక బీడు భూములుగా మారిన పల్లెలు నేడు పుడమికి పచ్చని రంగేసిట్లుగా మారాయని అన్నారు.
పల్లెలకు పచ్చని తోరణం కట్టినట్లుగా తెలంగాణ పల్లెలు కనువిందు చేయడం శుభ పరిణామంగా అభివర్ణించారు. దేశంలో ఎక్కడాలేని మౌలిక సదుపాయాలు తెలంగాణ పల్లెలలో ఉన్నాయి కాబట్టే దేశంలో టాప్‌ 20 గ్రామాలలో 19 గ్రామాలు తెలంగాణ రాష్ట్రానికి చెందినవే ఉండడం రాష్ట్ర ప్రజానీకానికి గర్వకారణం అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రామీణ ప్రాంతాలలో మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించి చేపడుతున్న పల్లె ప్రగతి కార్యక్రమంతో గ్రామాలలో ఎన్నడు లేని విధంగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయని అన్నారు. హరితహారంలో నాటిన చెట్లతో పల్లెలన్నీ పచ్చని వాతావరణంతో పరిఢవిల్లుతున్నాయని పేర్కొన్నారు. గ్రామాల్లో ఉన్న సమస్యలను పల్లె ప్రగతిలో గుర్తించి పరిష్కరించేందుకు అవకాశం ఏర్పడిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. గ్రామీణ ప్రాంతాలలోని ప్రజలు రాజకీయాలకతీతంగా అభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగాలని, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశయం మేరకు గ్రామాలు పట్టణాలకు దీటుగా అభివృద్ధి పథంలో పయనించాలని కోరారు. పల్లె ప్రగతి కార్యక్రమంలో కీలక భూమిక పోషిస్తున్న గ్రామపంచాయతీ సిబ్బందిని శాలువాలతో ఘనంగా సన్మానించారు. పల్లె ప్రగతి దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాలలో ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్సీకి గ్రామ గ్రామాన మహిళలు బతుకమ్మలతో ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, జెడ్పిటిసి సభ్యుడు శ్రీరామ్ శ్యామ్, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News