ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలోని ఆలయాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారని రాష్ట్ర ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ పార్టీ హుజురాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో ఆధ్యాత్మిక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆలయాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించిందని, ఆ దిశలోనే గ్రామీణ ప్రాంతాల్లో సైతం ఉన్న దేవాలయాలకు ధూప దీప నైవేద్యం కోసం ప్రత్యేక నిధులను కేటాయిస్తున్నట్లు చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లోని దేవాలయాల్లో పని చేస్తున్న అర్చకులకు గౌరవ వేతనాన్ని కల్పిస్తూ వారి సేవలను సద్వినియోగం చేసుకోవడం జరుగుతుందన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఆధ్యాత్మిక భావం మెండుగా ఉంటుందని యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని కనివిని ఎరుగని రీతిలో నిర్మాణం చేపట్టడం అందుకు నిదర్శనం అన్నారు. ప్రస్తుతం కరీంనగర్ జిల్లా కేంద్రంలో సుమారు 10 ఎకరాల విస్తీర్ణంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సర్వాంగ సుందరంగా నిర్మిస్తుండడంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రజల్లో భక్తి భావం పెంపొందించేందుకు అవకాశం ఉంటుందన్నారు. గత ఆంధ్ర పాలకుల పాలనలో ఆలయాలు ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదని కొట్లాడి సాధించుకున్న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దేవాలయాలలో నిత్యం పూజలు జరుగుతున్నాయన్నారు. ఆలయాల్లో నిత్యం పూజలు జరుగుతుండడంతో గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజల్లో భక్తి భావం పెంపొందుతుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు తన వంతు సహకారం అందించనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎస్సి కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, ఎంపీపీ సరిగొమ్ముల పావని వెంకటేష్, జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కళ్ళపల్లి రాజేశ్వర్ రావు, ఆలయ ఈవో కందుల సుధాకర్, అర్చకులు శేషం వంశీధరాచార్యులు, సిబ్బంది మోహన్, రాజయ్య, రమేష్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.