గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలను ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని రాష్ట్ర ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. జమ్మికుంట ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై తిరిగి వెళుతున్న సమయంలో కార్యాలయం ముందు నిరవధిక సమ్మె చేస్తున్న పంచాయతీ కార్మికులు ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి కలిసి తమ సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలని వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు తగు న్యాయం చేస్తున్నారని అన్నారు. గతంలో చాలీచాలని వేతనాలతో పనిచేస్తున్న పంచాయతీ కార్మికులకు ముఖ్యమంత్రి కేసీఆర్ సముచిత స్థానం కల్పించి వేతనాలను పెంచడం జరిగిందన్నారు. పంచాయతీ కార్మికులు ప్రభుత్వానికి సహకరిస్తూ గ్రామాల్లో పరిసరాల పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యుడు శ్రీరామ్ శ్యామ్, పలువురు సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, పంచాయతీ కార్మికులు పాల్గొన్నారు.