సీఎం కేసీఆర్ సింగరేణి సంస్థకి ప్రక్షపాతి అని, ఉద్యోగులు, కార్మికుల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. సింగరేణి సంస్థను ప్రైవేటీకరించి నిర్వీర్యం చేయాలన్న కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలను అడ్డుకున్నారని గుర్తు చేశారు. సింగరేణ సంస్థ లాభాల్లో 32 శాతం వాటాను కార్మికులకు పంచాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో బుధవారం రోజున టీబీజీకేఎస్ సంఘం నాయకులు కవితను హైదరాబాద్ లో కలుసుకొని కృతజ్ఞతలు తెలిపారు. కవిత మాట్లాడుతూ… తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా వ్యవహరించిన సింగరేణి కార్మికులను సీఎం కేసీఆర్ ఎప్పడూ మరచిపోబోరని అన్నారు.
అవకాశం ఉన్న ప్రతీసారి కార్మికులకు ప్రయోజనాలు కల్పిస్తున్నారని తెలిపారు. కార్మికులకు అత్యధిక బోనస్ ప్రకటించిన ఎకైక రాష్ట్రం తెలంగాణ అని, 2014లో 18 శాతం బోనస్ ఉండగా…. 2022 నాటికి 30 శాతానికి పెంచామని, ఈ సారి 32 శాతానికి పెరగడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. సింగరేణి కార్మికుల సంక్షేమానికి, అభివృద్ధికి బీఆర్ఎస్ పార్టీ నిరంతరం పాటు పడుతుందని, తమ పార్టీ అన్ని విధాలుగా కార్మికులకు అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీబీజీకేఎస్ జనరల్ సెక్రెటరీ మిరియాల రాజిరెడ్డి, టీబీజీకేఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెంగర్ల మల్లయ్య మరియు టీబీజీకేస్ నాయకులు పాల్గొన్నారు.