మూసీ డెవలెప్‌మెంట్ ప్రాజెక్టుపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత(BRS MLC Kavitha) కీలక వ్యాఖ్యలు చేశారు. శాసనమండలి మీడియా పాయింట్ వద్ద ఆమె మట్లాడుతూ.. మూసీ ప్రాంత ప్రజలకు ఆస్తి నష్టం జరిగితే ఊరుకోబోమని హెచ్చరించారు. రేవంత్ రెడ్డి సర్కార్ కనికరం లేకుండా ప్రజలపైకి బుల్‌డోజర్లను పంపుతుందని ఫైర్ అయ్యారు. మూసీ ప్రాజెక్టుపై మండలిలో ప్రభుత్వం దాటవేత సమాధానాలు ఇవ్వడం దారుణమన్నారు. ప్రజలను ప్రభుత్వం తప్పదోవ పట్టించడం సరికాదని హితవు పలికారు.
ఈ ప్రాజెక్టు కోసం ప్రపంచ బ్యాంకు నుంచి రూ.4100 కోట్ల రుణాన్ని ప్రభుత్వం కోరిందని తమకు సమాచారం ఉందన్నారు. డీపీఆర్ లేకుండా వరల్డ్ బ్యాంక్ ఎలా రుణం ఇస్తుందో ప్రభుత్వం చెప్పాలని కవిత డిమాండ్ చేశారు. మూసీ ప్రక్షాళనకు బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. అయితే ప్రజలకు పునరావసం కల్పించిన తరువాత ప్రాజెక్ట్ పనులు ప్రారంభించాలన్నారు. మూసీ సుందరీకరణ వల్ల 7 వేల మంది పేదలు ఇళ్లు కోల్పోతారనే ఈ ప్రాజెక్టు జోలికి మాజీ సీఎం కేసీఆర్ వెళ్లలేదని పేర్కొన్నారు. మూసీ పరివాహక ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలిగినా.. బీఆర్ఎస్ పార్టీ వారికి అండగా ఉంటుంది అని ఆమె వెల్లడించారు.