ముఖ్యమంత్రి ఢిల్లీ పోతారా? ప్రధాని మోదీ కాళ్లు పట్టుకుంటారా? ఏం చేస్తారో మాకు సంబంధం లేదు. కానీ కచ్చితంగా రూ. 25 వేల మద్ధతు ధర సాధించాల్సిందే అని డిమాండ్ చేశారు. ఆంధ్ర ప్రదేశ్ లో కూడా మిర్చి ధరలు తగ్గగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రులను కలిసి లొల్లి లొల్లి చేశారని, ఇక్కడ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనీసం ఒక మాట కూడా మాట్లాడడం లేదని విమర్శించారు.
కేసముంద్రం మిర్చి యార్డును సందర్శించిన కవిత, మిర్చి రైతుల కష్టాలను, ఇబ్బందులు, ధరల గురించి రైతులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అక్కడే మాట్లాడుతూ ధరలు తగ్గి రాష్ట్రవ్యాప్తంగా మిర్చి రైతులంతా ఇబ్బంది పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. గతేడాది క్వింటాలు మిర్చి ధర రూ. 25 వేలు ఉండగా అది ఈ సారి రూ. 11 వేలకు పడిపోయిందని తెలిపారు. రైతులకు గిట్టుబాటు కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేశారు. ఒక ఎకరా మిర్చి పంట సాగు చేయడానికి రూ. 2-3 లక్షలు ఖర్చవుతుందని తెలిపారు. ప్రభుత్వం తక్షణమే గిట్టుబాటు ధరను కల్పించడానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మిర్చితో పాటు కూడా పసుపు కూడా గిట్టుబాటు ధర కల్పించాలని అన్నారు.

మహబూబాబాద్ – కేసముద్రం ప్రాంతానికి చెందిన మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్ రెడ్డి ఎప్పుడూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చుట్టే ఉంటారని, ఓటుకు నోటు కేసులో కూడా ఒకరు ఏ1, మరొకరు ఏ3గా ఉన్నారని, అయినా కూడా మిర్చి రైతుల కష్టాలు సీఎంకు చెప్పడానికి వేం నరేందర్ రెడ్డికి ఒక్క నిమిషం దొరకడం లేదా అని ప్రశ్నించారు.

కేసీఆర్ నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందని చెప్పడానికి సీఎం రేవంత్ రెడ్డి రైతులకు నీళ్లు ఇవ్వడం లేదని, దాంతో మహబూబాబాద్ ప్రాంతంలో 3 లక్షల ఎకరాలు ఎండిపోయాయని చెప్పారు. ఈ ఏడాది నీళ్లు విడుదల చేయాల్సిందేనని, లేదంటే రైతుల తరఫున తాము పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని ప్రకటించారు.
