Kavitha on New Party: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత రాజకీయ భవిష్యత్తుపై లండన్‌లోని ప్రవాస తెలంగాణీయులతో ముఖాముఖిలో కీలక వ్యాఖ్యలు చేశారు. కొత్త పార్టీ ఏర్పాటుపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేసిన ఆమె, ప్రజలు కోరుకుంటే, సందర్భం వస్తే తప్పనిసరిగా పార్టీ పెడతానని సంకేతాలిచ్చారు.
తెలంగాణ జాగృతిని దేశానికే రోల్ మోడల్‌గా నిలపాలన్నదే తన సంకల్పమని కవిత తెలిపారు. తమ దృష్టి కేవలం సామాజిక తెలంగాణ కోసమే అని చెప్పారు. “ప్రజల జీవితాల్లో మార్పులు తేవడంపై నాకు స్పష్టమైన ఆలోచన ఉంది. తప్పనిసరిగా నాకు అవకాశం వస్తుంది. ఎన్నికలకు ఇంకా మూడున్నరేళ్ల సమయం ఉంది; అప్పటి వరకు ఎలాంటి మార్పులు వస్తాయో చూడాలి,” అని కవిత పేర్కొన్నారు.
కాంగ్రెస్ ‘మునిగిపోయే పడవ’, బీజేపీ డీఎన్‌ఏ సరిపడదు
తన వెనుక ఏ జాతీయ పార్టీ లేదని, వాటిలో చేరే ఉద్దేశం కూడా లేదని కవిత తేల్చి చెప్పారు. కాంగ్రెస్ పార్టీ మునిగిపోయే పడవ అని, అభివృద్ధి పథంలో సాగుతున్న తెలంగాణను భ్రష్టు పట్టిస్తోందని విమర్శించారు. ఇక భారతీయ జనతా పార్టీ (BJP) డీఎన్‌ఏ తనకు సరిపడదని స్పష్టం చేశారు.
బీఆర్ఎస్ లో అవమానాలు, కుట్రలు
భారత రాష్ట్ర సమితి (BRS) లో ఎదురైన ఇబ్బందులపై కవిత మనసు విప్పి మాట్లాడారు. 20 ఏళ్లు కష్టపడి పనిచేసినా, కొందరిలో స్వార్థం పురుడుపోసుకుందని, వారి కారణంగా కోట్లాది మంది బాధపడొద్దన్నదే తన తపన అని అన్నారు. “నా ఓటమి మొదలు అసెంబ్లీ ఎన్నికల్లో భారాస ఓటమి వరకు ఎన్నో కుట్రలు జరిగాయి. పార్టీలో చాలా అవమానాలు ఎదురయ్యాయి” అని ఆమె ఆరోపించారు. తప్పనిసరి పరిస్థితుల్లోనే మాట్లాడాల్సి వచ్చిందని, తన రాజీనామాను ఆమోదించకపోవడంపై ఛైర్మన్‌ను ప్రశ్నించారు. కేసీఆర్ బిడ్డగా కష్టమైనా ధైర్యంగా తన పంథాను ఎంచుకుంటానని కవిత ప్రకటించారు. జైలు జీవితం తనలో సమూల మార్పులు తీసుకొచ్చిందని, నిజమైన మార్పు కోసం తెలంగాణ ఉద్యమకారులు ఒక్కటై పని చేయాలని పిలుపునిచ్చారు.


