Friday, September 20, 2024
HomeతెలంగాణKavitha: కాంగ్రెస్ అహంకారాన్ని ఓడిద్దాం

Kavitha: కాంగ్రెస్ అహంకారాన్ని ఓడిద్దాం

గుణమున్న గణేష్ కావాలా? ధనమున్న ధన్ పాల్ కావాలా ?

కాంగ్రెస్ అహంకారాన్ని ఓడిద్దామని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో పాటు ఆ పార్టీ ఇతర నాయకులు విపరీతమైన అహాన్ని ప్రదర్శిస్తున్నారని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ అంటే ఆత్మీయత… కాంగ్రెస్ అంటే అహంకారమని అన్నారు. కాంగ్రెస్ లో ఒక్క కుర్చీ కోసం నాయకులు కొట్టుకుంటారని, ఇక కాంగ్రెస్ కు ప్రజల గురించి ఆలోచించే సమయం వారికి ఎక్కడ ఉంటుందని అడిగారు. తమ సీఎం అభ్యర్థి సీఎం కేసీఆర్… మరి కాంగ్రెస్ సీఎం అభ్యర్థి ఎవరో చెప్పాలన్నారు. ఒక్క అవకాశం ఇవ్వాలని అడుగుతున్న బీజేపీ ఆరు సార్లు అవకాశమిస్తే నిజామాబాద్ కు ఎం చేసిందని నిలదీశారు. నిజామాబాద్ జిల్లా పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే గణేష్ గుప్తాతో కలిసి కవిత గారు కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఎన్నికల ప్రచారంలో అనుసరించాల్సిన తీరు గురించి కార్యకర్తలకు సలహాలు, సూచనలు ఇచ్చారు. గత పదేళ్ల కాలంలో తమ పార్టీ ప్రతీ ఒక్కరి సంక్షేమానికి, బాగు కోసం పనిచేశామని, కానీ ఎప్పుడూ అహంకారాన్ని ప్రదర్శించలేదని తెలిపారు. ఎప్పుడూ ఏమీ చేయని కాంగ్రెస్ పార్టీకి, బీజేపీ పార్టీలు చెప్పలేనంత అహంకారాన్ని ప్రదర్శిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక వేదిక వద్ద కార్యకర్తలను పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తంతున్న వీడియోను చూశానని, గతంలో కొడుతున్న వీడియోను చూశామని వివరించారు. ఉస్మానియా విద్యార్థులను అడ్డమీది కూలీలని కూడా రేవంత్ రెడ్డి దూషించారని, రైతులకు మూడు గంటల కరెంటు చాలని అన్నారని, ఇలా విపరీతమైన అహంకారాన్ని ప్రదర్శిస్తున్నారని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో లేనప్పుడు కూడా ఆత్మీయంగానే ఉన్నామని, ఇప్పుడూ అలానే ఉంటున్నామని చెప్పారు. బీఆర్ఎస్ అంటే ఆత్మీయత అని, కాంగ్రెస్ అంటే అహంకారమని అన్నారు. బీఆర్ఎస్ మన ఇంటి పార్టీ అని, కాంగ్రెస్ పార్టీ మన మంచికోరే పార్టీ కాదని తెలిపారు. తెలంగాణ ఇవ్వడానికి 60 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ అరిగోస పెట్టిందని, సీఎం కేసీఆర్ దీక్ష చేస్తే ఇచ్చినట్టే ఇచ్చి మళ్లీ వెనక్కి తీసుకుందని, చివరికి వందలాది మంది తెలంగాణ బిడ్డలను పొట్టనపెట్టుకున్న తర్వాత తెలంగాణ ఇచ్చిందని వివరించారు. “కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏక్ అనార్ హై సౌ బిమార్ హై” అన్నట్లుగా ఉంటుందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ లో ఒక్క కుర్చీ కోసం అనేక మంది కొట్టుకుంటారని, కానీ తాము మాత్రం తమ సీఎం అభ్యర్థి సీఎం కేసీఆర్ అని గర్వంగా చెబుతామని స్పష్టం చేశారు.

- Advertisement -

కాంగ్రెస్ సీఎం అభ్యర్థి ఎవరని ప్రశ్నించారు. కుర్చీ కోసం కొట్లాటకే కాంగ్రెస్ నాయకుల సమయం సరిపోదని, ఇక ప్రజల గురించి ఆలోచించే పరిస్థితి ఆ పార్టీ నాయకులకు లేదని అన్నారు. బీఆర్ఎస్ బలమైన పార్టీ అని, కాబట్టి తప్పకుండా మూడో సారీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఒక్కసారి అవకాశం ఇవ్వాలని బీజేపీ చెబుతోందని, కానీ ఆరు సార్లు అవకాశం ఇస్తే అవకాశం ఇచ్చినా చేయని పనులు కొత్తగా ఏమి చేస్తారని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీకి 54 ఏళ్లు అవకాశం ఇచ్చినా ఏమీ చేయలేదని విమర్శించారు. గుణమున్న గణేష్ కావాలా లేదా ధనమున్న ధన్ పాల్ కావాలా అన్నది నిజామాబాద్ తేల్చుకోవాలని, గుణమున్న గణేష్ గుప్తాను ప్రజలు గెలిపించుకుంటారన్న సంపూర్ణ విశ్వాసముందని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీ డీఎన్ఏలోనే గుణముందని తెలిపారు. ప్రజల కోసం మంచి చేసే వ్యక్తి గణేష్ అని చెప్పారు. నిజామాబాద్ అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ చూపించారని, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కోసం సీఎం కేసీఆర్ ను ఒప్పించి రూ. 45 కోట్లు తెచ్చారని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ అంటే పుష్పక విమానమని, ఎంత మంది వచ్చినా స్వాగతించామని, ఇంకా రావాలన్న కూడా స్థలముందని, అంత పెద్ద పార్టీ తమదని స్పష్టం చేశారు. డివిజన్ వారీగా సమన్వయం చేసుకోవాలని, తద్వారా ప్రతీ గల్లీలో తమకు ఎదురు ఉండదని స్పష్టం చేశారు. కనీసం 55 వేల మెజారిటీతో గణేష్ గుప్తాను గెలిపించడానికి కృషి చేయాలని కార్యకర్తలకు మార్గనిర్దేశం చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News