బీఆర్ఎస్ పార్టీలో కీలక నేతగా ఉన్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన తండ్రి.. పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు రాసిన లేఖపై తన వైఖరిని స్పష్టం చేశారు. అమెరికా పర్యటన నుంచి తిరిగొచ్చిన ఆమె, హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో మీడియాతో మాట్లాడుతూ.. లేఖ తానే రాశానని.. అయితే అది బయటకు ఎలా లీక్ అయ్యిందో తనకు అర్థం కావడం లేదని తెలిపారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ తాను రాసిన లేఖలో వ్యక్తిగత ప్రయోజనాలు ఏమీ లేదని.. ఇది పూర్తిగా పార్టీకి సంబంధించిన విషయాలపై తన అభిప్రాయాలని తెలిపారు.
ఇక కేసీఆర్‌గారు దేవుడు లాంటి నాయకుడు. కానీ ఆయన చుట్టూ కొన్ని బలాలు, బలహీనతలున్నాయని తనకు అనిపించింది. ఆ విషయాలు ఆయన దృష్టికి తీసుకురావాలనే ఆలోచనతోనే లేఖ రాసినట్లు ఆమె పేర్కొంది. అయితే తన అభిప్రాయాలు బయటకు రావడం, మీడియాలో చర్చకు దారితీస్తున్నది తనను బాధించిందని పేర్కొన్నారు. ఒక సామాన్య కార్యకర్త కూడా తన భావాలు తన నేతకు చెప్పలేని పరిస్థితి వచ్చిందా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలో కోవర్టులు ఉన్నారని కవిత ఆరోపించారు.
అసలు లేఖలో ఏముంది..?
తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత లేఖ వ్యవహారం పార్టీ అంతర్గత విభేదాలను వెలుగులోకి తెచ్చింది. ముఖ్యంగా, ఆమె తన తండ్రి మరియు పార్టీ అధినేత KCRకు రాసిన ఆరు పేజీల హస్తప్రతిలో పార్టీ కార్యకలాపాలపై తీవ్ర విమర్శలు చేశారు. లేఖలో, కవిత వరంగల్‌లో జరిగిన బీఆర్ఎస్ సిల్వర్ జూబిలీ సభలో కేసీఆర్ ప్రసంగాన్ని పంచ్ లేని దిగా అభివర్ణించారు. ప్రత్యేకంగా, బీజేపీపై కేవలం రెండు నిమిషాలపాటు మాత్రమే విమర్శలు చేయడం పార్టీ శ్రేణుల్లో భవిష్యత్తులో బీజేపీతో పొత్తు ఉంటుందనే అనుమానాలను కలిగించిందని పేర్కొన్నారు. ఇది ఆమె వ్యక్తిగతంగా అనుభవించిన బాధల వల్ల కావచ్చని, అయినప్పటికీ బీజేపీపై మరింత తీవ్రంగా విమర్శించాల్సిందని సూచించారు.
అలాగే, పార్టీ కార్యకర్తలు, నాయకులు కేసీఆర్‌ను కలవడం కష్టంగా మారిందని, ఎంపిక చేసిన కొందరినే కలుస్తున్నారని విమర్శించారు. పార్టీ స్థాపన కాలం నుండి ఉన్న నేతలకు సభలో మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడం, పాత ఇన్‌చార్జ్‌లను కొనసాగించడం వంటి అంశాలను కూడా లేఖలో ప్రస్తావించారు. ఇక ఈ లేఖ లీక్ కావడం వెనుక పార్టీ అంతర్గత రాజకీయాలు ఉన్నాయని ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. కవిత స్వయంగా లేఖను లీక్ చేసి ఉండవచ్చని, లేదా పార్టీ నాయకత్వం ఆమెపై చర్యలు తీసుకునేందుకు లీక్ చేసి ఉండవచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
కవిత లేఖపై బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కూడా స్పందించాయి. బీజేపీ ఎంపీ రఘునందన్ రావు, కవితను పార్టీ నుంచి బయటకు నెట్టి, ఆమె కాంగ్రెస్‌లో చేరే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్, బీఆర్ఎస్, బీజేపీ ఒకటే అని, ఈ లేఖ దానికి నిదర్శనమని అన్నారు.ప్రస్తుతం, ఈ లేఖ వ్యవహారం బీఆర్ఎస్‌లో నాయకత్వ మార్పు, పార్టీ భవిష్యత్తు దిశపై అనేక ప్రశ్నలను లేవనెత్తుతోంది. కవితపై పార్టీ చర్యలు తీసుకుంటుందా, లేదా ఆమె స్వయంగా కొత్త రాజకీయ దిశలో అడుగులు వేస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది.