Kavitha sensational comments on BRS Leaders: కుట్ర చేసి తనను తన కుటుంబం నుంచి దూరం చేశారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత సంచలన ఆరోపణలు చేశారు. కామారెడ్డి జిల్లాలో జాగృతి జనం బాట కార్యక్రమంలో పాల్గొన్న ఆమె మీడియాతో మాట్లాడుతూ.. పరోక్షంగా బీఆర్‌ఎస్ నేతలపై తీవ్ర ఆరోపణలు చేశారు. కాళేశ్వరం ద్వారా కామారెడ్డికి ఒక్క ఎకారానికి కూడా నీళ్లు రాలేదన్నారు. ఈ విషయం చెబితే బీఆర్ఎస్ వాళ్లు తన మీద నోరు వేసుకొని పడిపోతారన్నారు. కాళేశ్వరం పనులను కొనసాగిస్తారా? ప్రత్యామ్నాయంగా కామారెడ్డికి నీళ్లు తెస్తారా? కాంగ్రెస్ నేతలు చెప్పాలని డిమాండ్ చేశారు. ప్యాకేజ్ 21, 22 ద్వారా కాంట్రాక్టర్లకే డబ్బులు పోయాయని, ప్రజలకు మేలు జరగలేదని గుర్తు చేశారు.
తెలంగాణ ప్రజలే నా కుటుంబం..
కవిత మాట్లాడుతూ.. “కుట్ర చేసి నన్ను కుటుంబం నుంచి దూరం చేశారు. ఈ విషయంలో నేను చాలా బాధపడ్డా. నన్ను బీఆర్‌ఎస్ పార్టీ నుంచి పంపించిన వారు తాత్కాలికంగా శునకానందం పొందవచ్చు. నన్ను కుటుంబం నుంచి దూరం చేసే కుట్రలో భాగంగానే సస్పెండ్ చేయించారు. మరో కుటుంబమైన నా తెలంగాణ ప్రజల కోసం ధైర్యంగా పనిచేస్తా. రేవంత్ రెడ్డి బీసీ ద్రోహి అని ఇప్పటికే ప్రకటించాం. బీసీ రిజర్వేషన్ల విషయంలో మొదటి ద్రోహి బీజేపీ, రెండో ద్రోహి కాంగ్రెస్. నేను జైల్లో ఉన్నప్పుడు నా పిల్లల కన్నా కూడా మా అమ్మ ఆరోగ్యం గురించే ఎక్కువగా బాధపడ్డాను. తెలంగాణ అనే మరో కుటుంబం నాకు ఉంది. వారి కోసం ధైర్యంగా పనిచేస్తాను” అన్నారు. కామారెడ్డికి చాలా ప్రత్యేకత ఉందని కవిత పేర్కొన్నారు. ఇక్కడ నుంచే కాంగ్రెస్ బీసీ డిక్లరేషన్ ప్రకటించిందని గుర్తుచేశారు. బీసీ రిజర్వేషన్లపై ఇక్కడి లీడర్లు చెబితే నమ్మరని కర్ణాటక సీఎం సిద్ధరామయ్యను తీసుకొచ్చి హామీలు ఇప్పించారన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బీసీలతో ఓట్లు వేయించుకొని.. ఇప్పుడు బీసీలకు చేయిచ్చిందని, ప్రజలు వాళ్ల మాటలు నమ్మి గెలిపించినందుకు తగిన బుద్ధి చెప్పారని గుర్తుచేశారు. అయితే, సంతోష్ రావు, హరీష్ రావులను దృష్టిలో పెట్టుకొనే కవిత ఇలాంటి సంచలన వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. గతంలోనూ వీరిద్దరిపై కవిత పలు అవినీతి ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.
Also Read: https://teluguprabha.net/telangana-news/jagga-reddy-vs-lakshman-comments/
కామారెడ్డిలో రైలు రోకో ఉద్రిక్తత..
నేడు (శుక్రవారం) కామారెడ్డిలో తెలంగాణ జాగృతి కార్యకర్తలు, పోలీసులకు మధ్య తోపులాట చోటుచేసుకుంది. బీసీ రిజర్వేషన్ల పెంపు నిరసన కార్యక్రమంలో రైలు రోకో చేపట్టిన జాగృతి అధ్యక్షురాలు కవితను పోలీసులు అడ్డుకున్నారు. కవిత పట్టాలపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. దీంతో కవితను పోలీసులు అడ్డుకునే క్రమంలో తోపులాట జరిగి ఆమె చేతికి స్వల్ప గాయమైంది.

