Kavitha’s removal from TBGKS : తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్)లో పదేళ్లపాటు గౌరవాధ్యక్షురాలిగా కొనసాగిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శకం ముగిసింది. కార్మిక చట్టాలకు విరుద్ధంగా, కేవలం రాజకీయ కారణాలతోనే తనను ఆ పదవి నుంచి తొలగించారని ఆమె ఆరోపిస్తున్న నేపథ్యంలో, ఈ పరిణామం బీఆర్ఎస్ పార్టీ అంతర్గత కుమ్ములాటలను మరోసారి బహిర్గతం చేసింది. అసలు టీబీజీకేఎస్‌లో ఏం జరిగింది.? కవిత ఆరోపణల వెనుక ఉన్న వాస్తవాలేంటి.? దశాబ్ద కాలంలో కార్మికుల కోసం ఆమె చేసిందేమిటి.? అనే ప్రశ్నలు ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి.
వివాదాస్పద ఎన్నిక.. రాజకీయ కక్ష సాధింపా : బుధవారం హైదరాబాద్‌లోని బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో టీబీజీకేఎస్ నూతన గౌరవ అధ్యక్షుడిగా మాజీ మంత్రి శ్రీ కొప్పుల ఈశ్వర్‌ను ఏకపక్షంగా ఎన్నుకోవడం తీవ్ర వివాదాస్పదమైంది. ఈ ఎన్నిక కార్మిక చట్టాలకు విరుద్ధంగా, కనీస సమాచారం లేకుండా జరిగిందని కవిత ఆరోపించారు. తాను అమెరికా పర్యటనలో ఉన్నప్పుడు, కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ అధినేత, తన తండ్రి కేసీఆర్‌కు రాసిన లేఖను లీక్ చేసి తనపై కుట్రలు పన్నుతున్నవారే, ఇప్పుడు తనను పదవి నుంచి తొలగించడంలోనూ కీలక పాత్ర పోషించారని ఆమె అన్నారు. పార్టీలో జరుగుతున్న పరిణామాలను ప్రశ్నించినందుకే తనపై కక్షగట్టారని, ఆడబిడ్డగా పార్టీ మంచి కోరితే వేధింపులకు గురిచేస్తున్నారని ఆమె వాపోయారు.
పదేళ్ల ప్రస్థానం… సాధించిన విజయాలు : తెలంగాణ ఉద్యమ సమయంలో సింగరేణి కార్మికులను ఏకతాటిపైకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిన కవిత, 2015 ఆగస్టు 17న కొత్తగూడెంలో జరిగిన జనరల్ బాడీ సమావేశంలో వెయ్యి మందికి పైగా సభ్యుల సమక్షంలో టీబీజీకేఎస్ గౌరవాధ్యక్షురాలిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆనాడు సంఘంలోని ముఖ్య నాయకులంతా ఆమెకు మద్దతు పలికారు. అప్పటి నుంచి పదేళ్లపాటు కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేశానని ఆమె పేర్కొన్నారు.
కవిత తన పదేళ్ల పదవీకాలంలో సాధించిన విజయాలుగా పలు అంశాలను ప్రస్తావించారు..
కారుణ్య నియామకాలు: ఉమ్మడి రాష్ట్రంలో నిలిచిపోయిన డిపెండెంట్ ఉద్యోగాలను ‘కారుణ్య నియామకాల’ పేరుతో పునరుద్ధరించి, 19,463 మంది యువతకు ఉద్యోగాలు ఇప్పించడంలో కీలక పాత్ర పోషించారు.
తెలంగాణ ఇంక్రిమెంట్: సకల జనుల సమ్మెలో పాల్గొన్న కార్మికులకు రాష్ట్రం ఏర్పడ్డాక ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా తెలంగాణ ఇంక్రిమెంట్ మంజూరు చేయించారు.
సంక్షేమ పథకాలు: రూ.10 లక్షల గృహ రుణంపై వడ్డీ చెల్లింపు, కార్మికుల క్వార్టర్స్‌కు ఉచిత విద్యుత్, ఏసీ సౌకర్యం, కార్మికుల తల్లిదండ్రులకు కార్పొరేట్ వైద్యం, మ్యాచింగ్ గ్రాంటును పది రెట్లు పెంచడం వంటి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయించారు.
సెలవులు, విద్యా ప్రోత్సాహకాలు: కార్మికుల పిల్లలకు ఐఐటీ, ఐఐఎం వంటి సంస్థల్లో ఫీజు రీయింబర్స్‌మెంట్, అంబేద్కర్ జయంతికి వేతనంతో కూడిన సెలవు, పండుగలకు ఆప్షనల్ సెలవులు మంజూరు చేయించడంలో కృషి చేశారు.
చెరగని ముద్ర… చెదిరిన బంధం : పదవిలో ఉన్నా లేకున్నా, ప్రతి కార్మిక కుటుంబంలో ఒక సోదరిగా, సభ్యురాలిగా ఎప్పటికీ అండగా ఉంటానని కవిత భరోసా ఇచ్చారు. తనను రాజకీయంగా దెబ్బతీసే కుట్రలు కార్మికుల ఐక్యతను దెబ్బతీయడమేనని ఆమె ఆరోపించారు. అయితే, పదేళ్ల పాటు అధికారంలో ఉండి చేయలేని పనులను ఇప్పుడు గుర్తుచేయడం హాస్యాస్పదమని, ఆమె హయాంలో సింగరేణి నిధులు దుర్వినియోగం అయ్యాయని ప్రత్యర్థి సంఘాలు విమర్శిస్తున్నాయి.
మొత్తం మీద, టీబీజీకేఎస్‌లో కవిత శకం ముగియడం బీఆర్ఎస్ పార్టీలోని అంతర్గత విభేదాలను తారాస్థాయికి చేర్చింది. ఈ పరిణామాలు రానున్న రోజుల్లో తెలంగాణ రాజకీయాల్లో, ముఖ్యంగా సింగరేణి ప్రాంతంలో ఎలాంటి మార్పులకు దారితీస్తాయో వేచి చూడాలి.


