నిజామాబాద్‌లో పసుపు బోర్డు(Turmeric Board)ను ఏర్పాటు చేయబోతున్నట్లు ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా పసుపు బోర్డు ప్రకటనను స్వాగతిస్తున్నట్లు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) తెలిపారు. కానీ పసుపు బోర్డు ప్రారంభోత్సవం బీజేపీ కార్యక్రమంలా ఉందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆహ్వానించకుండా కేవలం బీజేపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీ ప్రారంభించారని విమర్శించారు. కనీసం స్థానిక ప్రజాప్రతినిధులకు కూడా సమాచారం ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. కేవలం బోర్డు రావడం మాత్రమే సరిపోదని.. మద్దతు ధర ఉంటేనే రైతుకు గిట్టుబాటు అవుతుందని చెప్పారు.
2014లో తాను ఎంపీగా ఎన్నికైన నెల రోజుల్లోనే అప్పటి వాణిజ్యశాఖ మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman)కు పసుపు బోర్డు ఏర్పాటుపై లేఖ రాశానని గుర్తుచేశారు. అదే విధంగా ప్రధాని మోదీని(PM Modi) రెండు సార్లు కలిశానని పేర్కొన్నారు. పసుపు పంటకు రూ.15వేల మద్ధతు ధర ప్రకటించాలని డిమాండ్ చేశానన్నారు. ఎంపీ అర్వింద్(MP Arvind)కు వెకిలి మాటలు మాట్లాడడం అలవాటు అని మండిపడ్డారు. తాము పసుపు బోర్డు పోరాటం మొదలెట్టిన రోజుల్లో అర్వింద్ అసలు రాజకీయాల్లో లేరని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీలో ఆయన తండ్రిచాటు బిడ్డగా ఉన్నారని విమర్శించారు. అలాంటి అర్వింద్ పసుపు బోర్డు ఏర్పాటు తన ఘనతగా చెప్పుకోవడం సిగ్గుచేటు అన్నారు.