Friday, November 22, 2024
HomeతెలంగాణKCR @ Achampet: ఓడ గొడితే రెస్ట్ తీసుకుంటాం, మాకు వచ్చేదేమీ లేదు పోయేదేమీ...

KCR @ Achampet: ఓడ గొడితే రెస్ట్ తీసుకుంటాం, మాకు వచ్చేదేమీ లేదు పోయేదేమీ లేదు

ఎన్నికల్లో ఏం జరుగుతదో మీకు తెలుసు

• తెలంగాణ ప్రయాణం జరిగేటటువంటి ఈ పదవ సంవత్సరంలో మల్లా ఒక్కసారి ఎన్నికలు వచ్చినయి
• ఎన్నికల్లో ఏం జరుగుతదో మీకు తెలుసు, మాకంటే ఎక్కువ మీకు తెలుసు
• 24 ఏండ్ల పొద్దయింది. తెలంగాణ కోసం బయలు దేరి. 24 ఏండ్ల నాడు ఎవ్వడు లేడు. ఎవ్వడు ఏ చెట్టుకింద ఉన్నడో మీ అందరికి తెలుసు.
• ఇయ్యాల లేచినోడు లెవ్వనోడు వచ్చి కేసీఆర్ నీకు దమ్మున్నదా; కొడంగల్ రా అని ఒకడు, గాంధీ బొమ్మకాడికి రా అని ఒకడు . ఇవా సవాళ్లు విసురుడు. ఇది రాజకీయమయితదా. ఇది రాజకీయం అనుకోవాలా ఎన్నికలు వస్తా ఉంటాయి. పోతా ఉంటాయి. ఎన్నికల్లో ప్రజలు గెలిచే పరిస్థితి రావాలి. అప్పుడే బతుకులు బాగు పడుతయి.

- Advertisement -

• తెలంగాణ రాకముందు ఎవడు ఎక్కడెక్కడ ఉన్నడో ఎవడి బూట్లు తుడిచిండో ..ఎవడు ఏం పనిమీద ఉండెనో. ఇవాల మాట్లాడే సిఫాయిలందరూ ఏడుండెరో
• ఒక పక్షిలాగా నేనొక్కడిని ఊరు ఊరు వాడవాడల తిరిగాను. యావత్తు తెలంగాణను ఉద్యమ కెరటంగా తయారు చేశాను. తెలంగాణ వచ్చి బతికిపోయినం గడ్డకు పడ్డం
• దిండి ప్రాజెక్టు మీద నుంచి వచ్చినం. దుందుభి నది కనబడింది. బాలరాజు కట్టించిన చెక్ డ్యాంలు కనబడుతున్నాయి. అంతకు ముందు దుందుభిల దుమ్ములేచిపోయింది.

• గోరేటి వెంకన్న వాగు ఎండిపోయెరా. పెద్ద పేగు ఎండిపోయెరా అని పాట పాడి ఏడ్చిండు.

• ఎంత బాధ పాలమూరు లో గంజి కేంద్రాలు పెట్టిన్నాడు. అంబలి కేంద్రాలు పెట్టిన్నాడు. గొంతులెండి బిందెలు పట్టుకుని మోసిన్నాడు. అర్థరాత్రి కరెంటు కోసం పోయి పాములు, తేళ్లు కరిచి చచ్చిన్నాడు. గొడగొడ ఏడ్చుకుంట బొంబాయి పోయిన్నాడు ఈ కొడుకులంత ఎక్కడున్నరు. ఎవడన్న వచ్చిండా .రేపు ఉంటరా.

• ఎలక్షన్లు రాగానే ఆగమాగం కావద్దు. ఎవ్దడు పడితే వాడే వస్తడు.
బహురూపులొల్లు వచ్చినట్లు వస్తరు. ఏడి పడితే అది చెబుతరు

• తెలంగాణను కాపాడుకోవాలి కాబట్టి, మీ బిడ్డను కాబట్టి దండం పెట్టి చెబుతున్నా నా వంతు పని నేను చేసిన. పోరాటం నేనే చేయాలనా. ఇప్పుడు పోరాటం మీరు చేయాలే
• తెలంగాణ కోసం నేను వెళ్లిన్నాడు ఎ వ్వడికి నమ్మకం లేదు
• ఒక్కన్నే మనిషిని నేడు పిడికెడు మందిని పెట్టుకుని పోయిన . పోరాటంలో నిజాయితీ ఉంది కాబట్టి దమ్ముంది కాబట్టీ… పోతూ పోతూ తెలంగాణ ఒక్క ఉప్పెనలా తయారైతే విధిలేక తెలంగాణు ఇచ్చిండ్లు

• కేసీఆర్ అన్నదాంట్లో నిజమేంది అబద్దమేందనేది ప్రజలు ఆలోచన చేయాలే
• పదేండ్ల కింద తెలంగాణ ఎట్లుండే. కరెంటు లేదు. కరెంటు లేదు, నీళ్లు లేవు, సాగు నీళ్లు లేవు. కరెంటు వస్తే దేవుని దయ. పటాకులు కాలినట్లు మోటర్లు కాలుడు
• గోస అనుభవించింది తెలంగాణ. యాది చేసుకుంటే భయం అవుతది

• 24 గంటలు కరెంటు ఇచ్చే ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణలో ఉన్నది

• కర్ణాటకలో కరెంటు 5 గంటలు కూడా ఇస్తలేరు. 24 గంటలు ఇస్తమన్నరు కర్నాటకలో కాంగ్రెసోళ్లు, ఎల్లెలుకల పడ్డారు. అక్కడ పంటలు ఎండిపోతున్నాయి.

• పెద్ద పెద్ద సిఫాయిలు వస్తరు.బీజేపీ కెల్లి దిగుతరు ముఖ్యమంత్రులు. మన దాంట్లో 10 శాతం అభివృద్ధి చేయనోడు మనకు నీతి చెప్పేందుకు వస్తరు. వాని దగ్గర మంచినీళ్లు దిక్కులేవు. వాళ్లు మనకు చెప్పడానికి వస్తరు సన్నాసులు. వాళ్ల దగ్గర కరెంటు ఇవ్వరు ఇక్కడ ఉపన్యాసం చెప్పడానికి వస్తరు.

• భారతదేశానికి ఒక మార్గదర్శకత్వం చూపించే పద్ధతికి 10 ఏండ్లలో తెలంగాణను తయారు చేసినం.

• ఇండియాలో ఒకే ఒక్క స్టేట్ మంచినీళ్లను ఇంటింటికి అందిస్తున్నది. మన్ననూరు, అమ్రాబాద్, అప్పర్ ప్లాట్ కావచ్చు.680 మీటర్ల ఎత్తున్నదని అధికార్లు చెప్పిండ్లు.680 ఫీట్లు ఉండనీ 12 వందలు ఎత్తు ఉన్నా నీళ్లు పోవాలే బిడ్డ లేకపోతే చంపేస్తా అని చెప్పినా . ఆదిలాబాద్ గోండు గూడేల్లో, గోండు గూడేల్లో, కోయ గూడేలల్లో ఎవరి ఇంటి ముందు వారికి నల్లా పెట్టినాను.

• కొడంగల్ కు వస్తవా కొడవలి పట్టుకుని వస్తవా. కేసీఆర్ దమ్ము సంగతి ఇండియా అంతా చూసింది. నువ్వు చూడాలన్నా, నేను చూడాల్నా.

• నవంబర్ 30 తేదీ నాడు దుమ్ము రేగాలే బ్రహ్మాండమైన మెజారిటీతో బాలరాజు గెలిచి రావాలి

• తిట్టేటోడు ఎప్పటికీ ఉంటడు. వెక్కిరించేటోడు ఉంటడు.తిట్టదలుచుకున్నోడు ఇట్ల తిడుతడు అట్ల తిటుతడు

• తలసరి ఆదాయం, తలసరి విద్యుత్ వినియోగం, సాగునీటి రంగంలో కానీ నెంబర్ వన్ గా ఉన్నం
• తెలంగాణలో 60 కోట్ల టన్నులు కూడా పండకపోయేవి. ఈ రోజు తెలంగాణ మూడు కోట్లు టన్నుల వరిధాన్యం పండిస్తుంది. మూడు కోట్లు పోయి నాలుగు కోట్లు కావాలా.ముండగోపుగాండ్లు వచ్చి రెండు కోట్లకు ధాన్యం తేవలెనా. ఇదీ అలోచించాలి.

• మేము వట్టి మాటలు చెప్పలేదు. నరకలేదు. నేను అసెంబ్లీలో చెప్పినాను. 24 గంటల కరెంటు తెస్తానంటే పెద్ద మనిషి జానారెడ్డి గజం ఎత్తు దునికిండు కాంగ్రెస్ విడిచిపెట్టి గులాబీ కండువా కప్పుకుని ప్రచారం చేస్తా అని జానారెడ్డి అన్నడు తర్వాత పారిపోయిండు

• వాళ్లకు నమ్మకం లేదు. అసెంబ్లీలో చెప్పాను. ఐదేండ్లలో మంచినీళ్లు ప్రతి ఇంటికి మంచినీళ్లు ఇవ్వకుంటే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయమని చెప్పాను. ఎవరన్నా భారత దేశంలో ఇట్ల చెబుతరా. ఏ ముఖ్యమంత్రైనా చెప్పిండా భారత దేశంలో చిత్తశుద్ధి, నిజాయితీ ఉంటే సాధ్యమవుతుంది.

• కొత్తకుండలా ఈగ చొచ్చినట్లు. సంసారం చదురుకున్నట్లు శ్రద్ధతో, పద్ధతితో తెలంగాణు అభివృద్ధి చేసుకున్నాం.
పెన్షన్లు ఇచ్చుకున్నం. విధి వంచితుల కోసం ఇద్దామనే మానవీయ కోణంతో ఇచ్చుకున్నాం
• పేదోళ్ల వద్ద కొసరొద్దని చెప్పి రూ.1000 పెట్టుకున్నాం. పెంచుకున్నాం. కల్యాణలక్ష్మి కూడా పెంచుకున్నాం. ఎన్నికల కోసం కాదు. పెన్షన్లను వేలల్లో తీసుకుపోయింది ముఖ్యమంత్రి కేసీఆర్.

• రైతుబంధు గురించి ఆలోచించినోడు లేడు. ప్రపంచంలో దీనిని పుట్టించిందే కేసీఆర్. ఎన్ని సర్కార్ లు వచ్చినా చేయలేదు. తెలుగుదేశం, కాంగ్రెస్ వచ్చినా రైతులకు ఒక్క రూపాయి ఇచ్చింది లేదు.

• రైతుల ముఖాలు తెల్లపడాలని రైతుబంధు పథకాన్ని పెట్టిందే కేసీఆర్. మొదట రూ.4 వేలు . వేయి పెంచుకుని రూ, 5 వేలు ఎకరానికి ఇచ్చాం. మెనిఫెస్టోలో పెట్టుకున్నాం. 16 వేలకు పెంచుకుందామని హామీ ఇచ్చినాం. ఒక సంసారి రీతిలో పెంచుకుంటూ పోవాలని హామీ ఇచ్చినం. లంగ హామీలు ఇవ్వం

• తెలంగాణ ఇవ్వాల అన్నపూర్ణ అయ్యింది. మూడు కోట్ల టన్నుల వడ్లు పండించి దేశానికి అందిస్తుంది. రేషన్ కార్డు ఉన్న 93 లక్షల కుటుంబాలకు సన్నబియ్యం తినాలని ఇవ్వడానికి నిర్ణయించింది.

• అవినీతి లేకుండా చేసుకుంటూ పోతే ఇక్కడికి వచ్చినం. ఏమైనా కింది మీద అయితిమా కైలాసం ఆటలో పెద్దపాము మింగినట్లే అయితది.

• మళ్లీ మెదటికే వస్తది. తెలంగాణ ఆగం అవుతది. కుక్కలు నక్కలు చింపిన తెలంగాణ అవుతది. అప్పుడు నేను కూడా ఏమి చేయలేను. నేను ఎంతకని కొట్లాడాలే. కొట్లాడే బాధ్యత మీది. తెలంగాణ ప్రజల మీదనే కొట్లాడే బాధ్యత పెడుతున్నాను. అచ్చంపేట వేదిక నుంచి చెబుతూ ఉన్నా.

• మంచి సమాజం నిర్మాణం కావాలి. ఇరిగేషన్ సదుపాయం పెరుగాలి.

• ఉమా మహేశ్వర లిఫ్టు మంజూరు చేసుకున్నాం. మూడు రిజర్వాయర్లు కట్టుకుంటున్నాం. అప్పర్ ప్లాటో కు కూడా నీళ్లు తీసుకొచ్చే బాధ్యత నాది . తప్పకుండా తెచ్చిస్తాం

• అచ్చంపేట నియోజకవర్గంలో 1.75 లక్షల ఎకరాలతో పాటు 2 లక్షల ఎకరాలకు నీళ్లు అందించే బాధ్యత నాది.

• పాలమూరు ప్రాజెక్టు కడితే అడ్డం పడ్డదే కాంగ్రెస్ నాయకులు. కాళ్లలో కట్టెలు పెట్టినట్లు 192 కేసులు వేసినారు.

• నల్గొండ జిల్లాలో ఉన్న దిండి వాళ్లతో పాటు పాలమూరు జిల్లాల వారికి లాభం జరుగుతుంది.

• రాదనుకున్న తెలంగాణను తెచ్చి నిలబెట్టి పేద సాదలను కాపాడి రైతులను కాపాడి 24 గంటల కరెంటు ఇచ్చి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం

• ముస్లిం సోదరులకు రెసిడెన్షియల్ పాఠశాలలు పెట్టినం. అందరికీ కలిపి అన్ని వర్గాలకు కలిపి1000 కళాశాలలు పెట్టినం. రాబోయే రోజుల్లో డిగ్రీ కళాశాలలు కూడా చేసుకోవాలే.

• ఎవరు గెలిస్తే తెలంగాణ ముందుకు వెళ్తదో ఆలోచించుకోవాలే

• ఉన్న తెలంగాణ ఊడగొట్టిందెవరండీ, ఇప్పుడు బాగా ఎగేసుకుని వస్తున్నారు.

• ఉన్న తెలంగాణను ఊడగొట్టిందే కాంగ్రెస్. తెలంగాణ కావాలన్నప్పుడల్లా అనేక మందిని కాల్చి చంపిండ్రు. గోసపోసుకున్నరు.

• 1969 లో చెన్నారెడ్డి నాయకత్వంలో కొట్లాడితే 400 మందిని పిట్టల్లాకాల్చి చంపిండ్లు. లక్షలాది మందిని జైళ్లలో వేసిండ్లు

• నేను ఉద్యమం మొదలుపెడితే పొత్తు కలుద్దామన్నరు. పొత్తు పుణ్యాన గెలిచిండ్లు ఇక్కడ అధికారం వచ్చింది, ఢిల్లీలో అధికారంలోకి వచ్చారు.

• 2004 న అధికారంలోకి వస్తే 2014 దాకా తెలంగాణ ఇవ్వలేదు. 10 ఏండ్లు ఏడిపించిండ్లు.

• నేను చావునోట్లో తలకాయపెట్టి కేసీఆర్ శవయాత్ర నా..తెలంగాణ జైత్రయాత్రనా అని నినాదమిచ్చిఆమరణ నిరాహార దీక్ష చేస్తే తప్ప తెలంగాణ రాలేదు.

• 32 పార్టీల మద్ధతు కూడగట్టి యావత్ దేశం మాతోని ఉన్నది తొక్కిపడేస్తం జాగ్రత్త అంటే .చివరికి ఇవ్వక తప్పదని ఇచ్చిండ్లు తప్ప ప్రేమకు కాంగ్రెస్ ఇవ్వలేదు.

• 14 ఏండ్లు ఏడిపిచ్చి ఎంతోమంది పిల్లల చావుకు కారణమై తెలంగాణ ఇచ్చారు కానీ మర్యాదకు కాంగ్రెస్ ఇయ్యలేదు.

• కాంగ్రెస్ వారికి ఇవ్వాల కూడా తెలంగాణ బాగోగులు కాదు. వారికి తెలంగాణ మీద పెత్తనం కావాలి

• రైతు భూమి మీద రైతుకే అధికారం ఉండాలని ధరణి తెచ్చినం ధరణిని తీసేస్తామని రాహూల్ గాంధీ, రేవంత్ రెడ్డి మల్లు భట్టి విక్రమార్క చెబుతున్నారు.

• రైతుబంధు పైసలు పడుతున్నాయి. టింగ్ టింగ్ మని మీ ఖాతాల్లో పడుతున్నాయి. కొనుగోలు కేంద్రాల్లో దాన్యం అమ్మితే మీ ఖాతాల్లో పడుతున్నాయి. ధరణి పుణ్యం వల్ల సాధ్యమవుతుంది. బంగాళాఖాతంలో కలుపుతా అంటున్నాడు.

• రిజిస్ట్రేషన్ ఎంతమంచిగా చేసినం. మండల కేంద్రంలో అవుతున్నది. పావుగంటలో మ్యుటేషన్ కూడా అవుతున్నది.

• కాంగ్రెస్ పార్టే పైరవీ కారుల పార్టీ

• సంవత్సరానికి 15 వేల కోట్లు రైతుబంధు ఇస్తున్నాం. కనీసం రెండువేల కోట్లైనా తినొద్దా అనేది కాంగ్రెస్ ఆలోచన. వీరికి గులగుల అవుతున్నది

• . కాంగ్రెస్ దుర్మార్గులను రానిస్తే రైతుబంధుకు రాంరాం, దళితబంధు జై భీం అయితది. కరెంటు కాటగలుస్తది. తెలంగాణ మొదటికే వస్తది. అప్పుడు కేసీఆర్ ను తిట్టినా లాభం లేదు.

• ధరణి తీసేస్తామంటే మీకు తమాషా లెక్క అనిపిస్తుంది. తమాషా కాదు. ధరణి తీసేస్తే పాత పద్ధతి వస్తది.

• మీ భూమిపై మీ దగ్గర అధికారం ఉండాలంటుంది బీఆర్ ఎస్ పార్టీ .. లాగేసుకోవాలంటుంది కాంగ్రెస్ పార్టీ . ఇందులో ఏ పార్టీ కావాలో రైతులే తేల్చుకోవాలి.

• కరెంటు 3 గంటలు ఇస్తానంటుంది కాంగ్రెస్. ఒక్క మడి తడుస్తదా? 24 గంటలు ఇస్తానని నేను చెబుతున్నా

• తీసేస్తాను అన్నోడికి బుద్ధి చెప్పాలి. 3 తారీఖు నాడు దుమ్ము రేగాలి.

• వెనుకబడ్డ ప్రాంతం. బాలరాజు ప్రజల పక్షాన కోరిన వాటినన్నింటిని ప్రభుత్వం వచ్చిన నెలలోపు ఉత్తర్వులు ఇస్తాను

• గిరిజనులకు పోడు పట్టాలు ఇచ్చినాం. ఎవరన్నా ఇచ్చాడా? రైతుబంధు వాటికి చెల్లించాం. గిరిజనులపై కేసులు ఎత్తివేశాం.

• దళిత సమాజం ఆలోచించాలి. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు దళితుల గురించి ఆలోచించలేదు. ఓటుబ్యాంకు మాదిరిగా వాడుకున్నారు. దళితబంధును నెహ్రూ కాలంలోనే అమలు చేసి ఉంటే దళితుల పరిస్థితి మెరుగ్గా ఉండేది. భారత దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి నోట్ల నుంచి రాలేదు. దళితబంధు అనే పదాన్ని పుట్టించిందే కేసీఆర్.

• మీరు ఓడ గొడితే రెస్ట్ తీసుకుంటాం. మాకు వచ్చేదేమీ లేదు పోయేదేమీ లేదు. నష్టపోయేది ప్రజలే. చెప్పుడు మా బాధ్యత. తెలంగాణను కోసం కొట్లాడిన వాళ్లుగా తెలంగాణను ఓ దరికి తీసుకువస్తున్న వాళ్లుగా మా కర్తవ్యం మీకు చెప్పాలి.

• ఎన్నికల తర్వాత ఒక రోజు అధికారులతో సహా వస్తాను.నల్లమల ప్రాజెక్టు, సలేశ్వరం వంటి ఎకో టూరిజం ఉంది. ఆమ్రాబాద్ వంటి ప్రాంతాలు మరింత అభివృద్ది చేసుకోవాల్సి ఉంది.మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీలు మధుసూదన చారి, దేశపతి శ్రీనివాస్, ఎమ్మెల్యేలు జైపాల్ యాదవ్, గువ్వల బాలరాజు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News