KCR Campaign in jubilee hills by election: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారం యుద్ధ క్షేత్రాన్ని తలపిస్తోంది. నేటితో ప్రచార గడువు ముగియనుండటంతో అన్ని ప్రధాన పార్టీలు సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. ఈ ఎన్నికలో ఎలాగైనా గెలవాలని ప్రధాన పార్టీలు సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. ప్రత్యేకించి అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్‌ఎస్ ఉపఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. నువ్వా నేనా అన్నట్టుగా ఇరుపార్టీల నేతలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సైతం ప్రచారంలో ఆరు రోజులు పాల్గొన్నారు. అయితే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాత్రం ఇంతవరకు ఉపఎన్నికల ప్రచారానికి రాలేదు. అసలు వస్తారా? రారో.. కూడా తెలియకుండా బీఆర్‌ఎస్ నేతలు సస్పెన్స్‌ను కొనసాగిస్తున్నారు. కేసీఆర్ వస్తే ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుందని పార్టీ కేడర్ భావిస్తుంది. కానీ నేటి వరకు పార్టీ నేతలకు సైతం గులాబీ బాస్ క్లారిటీ ఇవ్వడం లేదని తెలుస్తుంది. దీంతో కేసీఆర్ వింత వైఖరిపై సొంత పార్టీ నేతలే గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో దుబ్బాక సీన్ రిపీట్ అవుతుందేమోనని.. బీఆర్ఏస్ కింది స్థాయినేతలు ఆందోళనలో ఉన్నట్లు సమాచారం.
కేసీఆర్ నోటి నుంచి వచ్చే మాటలకు వేరే లెవల్: బీఆర్ఎస్ పార్టీకి ప్రతిష్ఠాత్మకంగా మారిన జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు ముఖ్య నాయకులందరు ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు ఈ ఎన్నికను ఎలాగైనా గెలుచుకోవాలనే ఉద్దేశంతో ఉన్నారు. అందుకే తమ స్థాయి తగ్గించుకోని.. జూబ్లీహిల్స్‌లో గల్లి గల్లి తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు. రెండు, మూడు వేల ఓట్లకు ఒకరు ఇంఛార్జిగా పనిచేస్తూ చెమటోడుస్తున్నారు. పార్టీ ఇక్కడ గెలిస్తే తమ భవిష్యత్‌కు భరోసా ఉంటుందని వారు నమ్ముతున్నారు. అయితే పార్టీ అధినేత కేసీఆర్ మాత్రం వింత వైఖరితో ముందుకెళ్తున్నారు. ఇంతవరకు ఉపఎన్నికల ప్రచారానికి రాలేదు. దీంతో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు కొంత నిరుత్సాహంతో ఉన్నట్టుగా తెలుస్తుంది. తాము ఎంత చెప్పినా కేసీఆర్ నోటి నుంచి వచ్చే మాటలకు వేరే లెవల్ ఉంటుందని వారు అంటున్నారు. ఆయన మాటలను ప్రజలు సీరియస్‌గా తీసుకుంటారని అంటున్నారు. పార్టీ వర్కింగ్‌ప్రెసిడెంట్ కేటీఆర్, హరీశ్ రావు సహా ఇతరులు ఎంత చెప్పినా అంత సీరియస్‌గా ఓటర్లు చూడరని విశ్లేషిస్తున్నారు. చివరి రోజైనా కేసీఆర్ ప్రచారంలో పాల్గొనాలని పార్టీ శ్రేణులు కోరుతున్నారు.
పార్టీ భవిష్యత్ ప్రశ్నార్థకం: బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన దుబ్బాక ఉప ఎన్నిక ప్రచారంలో సైతం కేసీఆర్ పాల్గొనలేదు. ఆ ఉప ఎన్నికలో హరీశ్ రావుకు పూర్తి ప్రచార బాధ్యతలను కేసీఆర్ అప్పగించారు. ట్రబుల్ షూటర్ అని పేరున్న హరీశ్ ఒక్కడు రంగంలోకి దిగుతే చాలనే భ్రమలో నాడు కేసీఆర్ ఉండే. దీంతో కేసీఆర్ ఆ ఉపఎన్నిక ప్రచారంలో పాల్గొనలేదు. దీంతో అతి తక్కువ మెజార్టీతో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఓడిపోయాడు. కేసీఆర్ ప్రచారానికి వచ్చి ఉండి ఉంటే బీఆర్‌ఎస్ సులువుగా గెలిచేదని.. ఫలితం వచ్చాక తమ పార్టీ నేతలు అనుకున్నారు. ఆనాడు కేసీఆర్ అతి విశ్వాసంతోనే ప్రచారానికి రాలేదని.. సొంత పార్టీ నేతలే చెవులు కొరుక్కున్నారు. అయితే ఇప్పుడు కూడా కేసీఆర్ ప్రచారానికి దూరంగా ఉంటున్నారు. జూబ్లీహిల్స్‌లో బీఆర్‌ఎస్ గెలిస్తే ఒకే.. కానీ తక్కువ మెజార్టీతో ఓడిపోతే మాత్రం కేసీఆర్‌పై సొంత పార్టీ నేతలే తీవ్ర స్థాయిలో విమర్శలు చేసే అవకాశం ఉంది. అంతే కాదు ఆ పార్టీ భవిష్యత్ సైతం ప్రశ్నార్థకంగా మారే అవకాశం ముమ్మాటికి ఉంటుంది.
భవిష్యత్ నాయకుడు ఆయనే: అధినేత కేసీఆర్ ఉపఎన్నికల ప్రచారానికి రాకపోవడానికి మరో కోణంలో ఆలోచిస్తే సంచలన విషయాలు అంతు చిక్కుతున్నాయి. నిజానికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బాధ్యత మొత్తం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చూసుకుంటున్నారు. బీఆర్‌ఎస్ అభ్యర్థి గెలిస్తే కేటీఆర్ నాయకత్వానికి ప్రజల ఆమోదం వచ్చిందని కేసీఆర్ స్వయంగా ప్రకటించే అవకాశం లేకపోలేదు. ఇక భవిష్యత్ నాయకుడు కేటీఆరే అని అధినేత తమ పార్టీ నేతలకు చెప్పే అవకాశం ఉంది.


