KCR Campaign in jubilee hills by election: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం యుద్ధ క్షేత్రాన్ని తలపిస్తోంది. ప్రచార గడువు చివరి దశకు చేరుకోవడంతో అన్ని పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, మాజీ మంత్రులు వివిధ పార్టీల తరఫున ప్రచారాన్ని ముందుండి నడిపిస్తున్నారు. ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు ఉప ఎన్నిక ఫలితాన్ని జీవన్మరణ సమస్యగా భావిస్తున్నాయి. అందుకే అన్ని ప్రధాన పార్టీలు ప్రచార పర్వాన్ని ముమ్మరం చేశాయి. అయితే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాత్రం ఇంతవరకు ఉపఎన్నికల ప్రచారానికి రాలేదు. అసలు వస్తారా? రారో.. కూడా తెలియకుండా బీఆర్‌ఎస్ నేతలు సస్పెన్స్‌ను కొనసాగిస్తున్నారు. కేసీఆర్ వస్తే ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుందని పార్టీ కేడర్ భావిస్తుంది. కానీ నేటి వరకు పార్టీ నేతలకు సైతం గులాబీ బాస్ క్లారిటీ ఇవ్వడం లేదని తెలుస్తుంది.
ప్రజలను ఆకట్టుకునే కేసీఆర్ ప్రసంగాలు: కేసీఆర్ ప్రచారానికి రావాలని జూబ్లీహిల్స్ ప్రజలతో పాటుగా యావత్ తెలంగణ సైతం ఎదురుచూస్తోంది. ఎందుకంటే ఆయన ప్రత్యర్థులపై చేసే కామెంట్లు, విమర్శలు.. సామెతలు ఓటర్లను ఆకట్టుకుంటాయి. అంతే కాకుండా పార్టీ కార్యకర్తల్లో జోష్ వస్తుంది. ఆయన చేసే వ్యాఖ్యలకు ఓటర్లు అంతోఇంతో ఆకర్షితులవుతారు. ఎందుకంటే ఆయన మాటలు ప్రజలను ఆలోచింపజేసేలా ఉంటాయి. అంతే కాకుండా సామర్థ్యాన్ని దెబ్బతీసేలా ప్రసంగం ఉంటుంది. దాంతో పార్టీ విజయం ఖాయమవుతుందని నేతలు సైతం భావిస్తున్నారు. అయితే కేసీఆర్ వ్యూహాలు ఎవరికి అంతుచిక్కవు. పార్టీలోని అగ్రనాయకులకు సైతం తెలియకుండా కేసీఆర్.. తన రాజకీయ వ్యూహాలను అమలుపరుస్తారు. ఆదివారం సాయంత్రం 5 గంటలకు ప్రచారం ముగియనుంది. దీంతో ఈ రోజు నుంచి ఏ క్షణమైనా కేసీఆర్ ప్రచారానికి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఎన్నికల కమిషన్‌కు ఇచ్చిన స్టార్ క్యాంపెయిన్ లిస్టులో సైతం కేసీఆర్ పేరు చేర్చారు. ఆ క్రమంలో నియోజకవర్గంలోని కేడర్ అంతా కేసీఆర్ రాక కోసం వేయి కన్నులతో ఎదురుచూస్తున్నారు. ఆయన రోడ్డుషోలు నిర్వహిస్తే పార్టీకి ప్లస్ అవుతుందని కార్యకర్తలు భావిస్తున్నారు. గులాబీశ్రేణులంతా ఆశతో ఉన్నప్పటికీ ఇప్పటివరకు పార్టీ మాత్రం ఇంకా కేసీఆర్ ప్రచారం విషయాన్ని సస్పెన్స్‌లోనే పెడుతోంది.
Also Read:https://teluguprabha.net/telangana-news/harish-rao-sensational-comments-on-cm-revanth/
కేసీఆర్ ప్రచార షెడ్యూల్‌పై స్పష్టత ఇవ్వని బీఆర్‌ఎస్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం గురించి పార్టీ నేతలతో కేసీఆర్ ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతూనే ఉన్నట్టుగా తెలుస్తోంది. నేతలు సమిష్టిగా పనిచేయాలని, గెలుపు మనదేని, కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలంతా ఆగ్రహంగా ఉన్నారని బీఆర్‌ఎస్ నేతలతో కేసీఆర్ అన్నట్టుగా సమాచారం. కాంగ్రెస్ రెండేళ్లలో వైఫల్యం చెందిందని.. ఆ అంశాన్నే విస్తృతంగా ప్రచారం చేయాలని కేసీఆర్ ఆదేశించారని సమాచరం. నిత్యం గ్రౌండ్ లెవల్ పరిస్థితులను మానిటరింగ్ చేయాలని పార్టీ అగ్రనాయకత్వానికి సూచించారని తెలుస్తోంది.
పెద్దాయన రాజకీయ వ్యూహాలు ఎలా ఉన్నా..: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలను బీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు జూబ్లీహిల్స్ ఫలితం నాంది కానుందని పార్టీ అధినేత కేసీఆర్ భావిస్తున్నారు. ఇక్కడి నుంచే పార్టీ జైత్రయాత్ర స్టార్ట్ అవుతుందని ఇటీవల కేటీఆర్ సైతం ప్రచారంలో అన్నారు. కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావడానికి ఇదే తొలి అడుగు అని పార్టీ నేతలు సైతం భావిస్తున్నారు. అంత కీలకంగా మారిన ఉప ఎన్నిక ప్రచారానికి కేసీఆర్ రాకపై మాత్రం ఇంతవరకు క్లారిటీ లేదు. పెద్దాయన రాజకీయ వ్యూహాలు ఎలా ఉన్నప్పటికీ.. ఆయన ప్రచారానికి వచ్చి పార్టీ కేడర్‌లో జోష్ నింపాలని పలువురు నేతలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అంతే కాదు యావత్ తెలంగాణ ప్రజలు సైతం కేసీఆర్ రాక కోసం ఎదురుచూస్తున్నారు.


