KCR tribute to Andesri sudden death: ప్రముఖ కవి, తెలంగాణ ఉద్యమ గీతం ‘జయ జయహే తెలంగాణ…’ రచయిత డాక్టర్ అందెశ్రీ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ తన సంతాపాన్ని ప్రకటించారు.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగిన సాంస్కృతిక ఉద్యమంలో అందెశ్రీ సాహిత్యం కీలక పాత్ర పోషించిందని కేసీఆర్ కొనియాడారు. ఆయన మరణం సాహితీ లోకానికి తీరని లోటు అని పేర్కొన్నారు. అందెశ్రీ కుటుంబ సభ్యులకు ఆయన తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అందెశ్రీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కేసీఆర్ ప్రార్థించారు. ఉద్యమ కాలంలో అందెశ్రీతో తనకున్న అనుబంధాన్ని కేసీఆర్ స్మరించుకున్నారు.
ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ (64) కన్నుమూశారు. ఇవాళ ఉదయం లాలాగూడలోని తన ఇంట్లో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే అప్రమత్తమైన ఆయన కుమారులు.. గాంధీ ఆస్పత్రికి తరలించారు. 7 గంటల 20 నిమిషాలకు హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. అయితే 7 గంటల 25 నిమిషాలకు అందెశ్రీ చనిపోయినట్టు వైద్యులు ప్రకటించారు. దీంతో తెలంగాణ సాహితీ లోకం కన్నీటిసంద్రంలో మునిగిపోయింది. అందెశ్రీ సుదీర్ఘమైన పజాసాహిత్యాన్ని తెలంగాణ సమాజానికి అందించారు. చదువుకోకున్నా అద్భుతమైన రచనలు చేశారు.


