కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వేలో కేసీఆర్(KCR), కేటీఆర్(KTR), హరీష్ రావు, డీకే అరుణ(DK Aruna) సహా అనేకమంది నేతలు పాల్గొనలేదని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అసెంబ్లీలో తెలిపారు. 50 రోజుల పాటు జరిగిన సర్వేలో ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ భూముల వివరాలిచ్చారన్నారు. కానీ భూముల వివరాలు నమోదు చేస్తున్నారని తెలియగానే బీఆర్ఎస్ నేతలు సర్వేలో పాల్గొనలేదని ఎద్దేవా చేశారు. అంతకుముందు అసెంబ్లీలో మంత్రివర్గం ఆమోదించిన కులగణన, ఎస్సీ వర్గీకరణ సర్వేను రేవంత్ ప్రవేపెట్టారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..రాష్ట్రవ్యాప్తంగా సర్వేను నిర్వహించామని తెలిపారు. మొత్తం 75 అశాలను ప్రాతిపదికగా తీసుకుని సర్వే నిర్వహించామన్నారు. నవంబర్ 9 నుంచి 50 రోజుల పాటు సర్వే కొనసాగిందన్నారు. గ్రామాల్లో 66.39 లక్షల కుటుంబాలు, పట్టణాల్లో 45.15 లక్షల కుటుంబాల్లో సర్వే నిర్వహించామన్నారు. మొత్తంగా రాష్ట్రంలో 1.12 కోట్ల కుటుంబాల వివరాలు సర్వే చేశామన్నారు. 96.9 శాతం కుటుంబాలు సర్వేలో భాగస్వామ్యం అయ్యాయని వివరించారు. ఈ సర్వే ప్రకారం రాష్ట్రంలో బీసీ జనాభా 46.25 శాతం(1,64,09,179) , ఓసీ జనాభా 17.79 శాతం(41.21లక్షలు), ఎస్సీలు 17.43 శాతం(61,84,319) , ఎస్టీలు 10.45 శాతం(37,05,929) , బీసీ మైనారిటీలు 10.08 శాతం(35.76లక్షలు)ఉన్నారని రేవంత్ ప్రకటించారు.
ప్రతి 150 ఇళ్లకు ఒక బ్లాక్ గుర్తించి సర్వే చేపట్టి గుర్తుచేశామని చెప్పుకొచ్చారు. ముందుకు స్టిక్కర్లు అంటించి సర్వే చేయాల్సిన ఇళ్లను గుర్తించామని పేర్కొన్నారు. సర్వేలో పాల్గొనే సిబ్బందికి అనేక సార్లు శిక్షణను ఇచ్చామని అన్నారు. మొత్తంగా రూ. 125 కోట్లు ఖర్చు చేసి సర్వే ద్వారా సమగ్ర వివరాలు సేకరించామన్నారు. తాము అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే సర్వే చేయించామని రేవంత్‌రెడ్డి తెలిపారు.