గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్(BRS) ఓడిపోయిన నాటి నుంచి ఆ పార్టీ అధినేత, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్(KCR) ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. అసెంబ్లీ సమావేశాలకు కూడా హాజరకాకుండా ఎర్రవెల్లి ఫాంహౌస్‌కే పరిమితమయ్యారు. అప్పుడప్పుడు పార్టీ నేతలను కలుస్తున్నారు. తాజాగా జహీరాబాద్ బీఆర్ఎస్ నియోజకవర్గ నాయకులతో ఆయన సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్(Congress) ఏడాది పాలనలో ప్రజలు సంతోషంగా లేరన్నారు.తాను చెప్పినా ప్రజలు వినకుండా అత్యాశకు పోయి కాంగ్రెస్‌కు ఓటేశారని తెలిపారు. గంభీరంగా, మౌనంగా ఈ ప్రభుత్వం పరిపాలనను చూస్తున్నానన్నారు. తెలంగాణ శక్తి ఏంటో కాంగ్రెస్ వాళ్లకు చూపించి మెడలు వంచుదామని పేర్కొన్నారు. కాంగ్రెస్ వాళ్లు కనబడితే ప్రజలు కొట్టేటట్టు ఉన్నారన్నారు. నిన్న కాంగ్రెస్ వాళ్లు పోలింగ్ పెడితే మనకే ఎక్కువ ఓటింగ్ వచ్చిందన్నారు. తాను కొడితే మామూలుగా కాదు.. గట్టిగా కొట్టడం తన అలవాటని వెల్లడించారు. ప్రత్యక్ష పోరాటాలకు బీఆర్ఎస్ శ్రేణులు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఫిబ్రవరి నెలాఖరులో భారీ సభ పెడుతామని.. ఈ సభకు గులాబీ దండు తరలిరావాలన్నారు.