KCR Sensational Comments on JubileeHills Candidate Naveen Yadav: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక చుట్టే ఇప్పుడు రాష్ట్ర రాజకీయం కేంద్రీకృతమైంది. ఇప్పటికే, ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులతో నామినేషన్లు వేయించి ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఒకరిపై ఒకరు బహిరంగంగా మాటలు తూటాలతో పదునైన విమర్శలు చేసుకుంటున్నారు. ఇప్పుడు, గులాబీ బాస్ కేసీఆర్ జూబ్లీహిల్స్ సీన్‌లోకి ఎంటరయ్యారు. ఇవాళ (గురువారం) జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సర్వసన్నాహక సమావేశంలో ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఓ రౌడీ షీటర్ ని నిలబెట్టి హైదరాబాద్ ప్రజలకు పరీక్ష పెట్టిందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆరోపించారు. రౌడీ షీటర్ ఫ్యామిలీ నుంచి వచ్చిన అభ్యర్థిని చిత్తుగా ఓడించి శాంతిభద్రతలు కాపాడాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గెలుపు ఖాయమని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. భారీ మెజారిటీ సాధించడమే లక్ష్యంగా బీఆర్ఎస్ నేతలు పని చేయాలని దిశా నిర్దేశం చేశారు. పార్టీ నేతలు ప్రజలతో మమేకమై కాంగ్రెస్ దుష్ట పాలనపై వివరించాలని సూచించారు. నమ్మించి మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వ దోపిడీ పాలనతో ఇప్పటికే రాష్ట్రం అధోగతిపాలైందని విమర్శించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో రాష్ట్రంలో దిగజారిన అభివృద్ధి గురించి, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో తలెత్తిన ప్రమాదకర పరిస్థితుల గురించి ఇంటింటికీ తిరిగి వివరించాలని పార్టీ నేతలకు కేసీఆర్ సూచించారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనా కాలంలో అమలు చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని కోరారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు ఇప్పుడు ఆగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశాన్ని ప్రజలతో కలిసి చర్చించాలని అధినేత సూచించారు. సిట్టింగ్ సీటును ఎలాగైనా నిలబెట్టుకోవాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. పార్టీ కీలక నేతలు, జూబ్లీహిల్స్ ఇంచార్జ్‌లతో ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో నిర్వహించిన కీలక భేటీలో ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సమావేశంలో అభ్యర్థి మాగంటి సునీతతో పాటు మాజీ మంత్రులు కేటీఆర్,హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకరావు, సునీతా లక్ష్మారెడ్డి, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, వేముల ప్రశాంత్‌రెడ్డి, సబితారెడ్డి, మహమూద్ అలీ, ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్, దాసోజ్ శ్రావణ్, రసమయి బాలకిషన్, మంచిరెడ్డి కిషన్ రెడ్డి, పద్మ దేవేందర్ రెడ్డి, తో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కీలక నేతలు హాజరయ్యారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై కేసీఆర్ వారితో చర్చించారు. ప్రస్తుతం నియోజకవర్గంలో నెలకొన్న పరిణామాలు, చేరికలు, ప్రచార శైలి తదితర అంశాలు చర్చకు వచ్చినట్లు సమాచారం.
40 మంది స్టార్ క్యాంపెయినర్లతో ప్రచారం..
కాగా, ఇప్పటికే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో కేటీఆర్, హరీశ్‌రావులతో కలిసి బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత విసృత్తంగా ప్రచారం చేస్తున్నారు. ఆయా డివిజన్‌లలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, మాజీలు విస్తృతంగా బస్తీల్లో పర్యటిస్తున్నారు. అయితే, ఎన్నికల ప్రచారంలో తాను పాల్గొనడంపై కూడా పార్టీ నేతలకు కేసీఆర్ స్పష్టత ఇచ్చినట్లు తెలుస్తోంది. ఉప ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ పాల్గొంటే విజయం సులభమవుతుందని పార్టీ శ్రేణులు సూచించినట్లు తెలుస్తోంది. దీంతో ఆయన కూడా కార్నర్ మీటింగ్స్, రోడ్ షోలో పాల్గొనే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. కేసీఆర్ రంగంలోకి దిగితే ఓటింగ్ సరళి మారుతుందన్న విశ్వాసాన్ని పార్టీ నాయకులు వ్యక్తం చేయడంతో ఆయన కూడా రెండు మూడు సమావేశాల్లో పాల్గొనడానికి అంగీకరించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే 40 మంది స్టార్ క్యాంపెయినర్లను బీఆర్ఎస్ పార్టీ నియమించించి. ఒకవేళ, కేసీఆర్ కూడా రంగంలోకి దిగితే జూబ్లీహిల్స్ పోరు మరింత రసవత్తరంగా సాగే అవకాశం ఉంది.


