అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని రేపు పాలకుర్తి నియోజకవర్గానికి బిఅర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి కేటీఆర్ రానున్నారు. మహబూబాబాద్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం, తొర్రూరు పట్టణంలో పలు అభివృద్ధి పనులకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో కలిసి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. అనంతరం తొర్రూరు పట్టణ అభివృద్ధి మీద సంబంధిత అధికారుల తో సమీక్ష చేస్తారు. ఆ తర్వాత కనీవినీ ఎరగని రీతిలో 20,000మంది మహిళలతో నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో కేటీఆర్ ప్రసంగిస్తారు. మహిళా దినోత్సవ కానుకగా, రాష్ట్ర వ్యాప్తంగా స్వయం సహాయక సంఘాలకు 750 కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలను మహిళలకు చెక్కుల రూపంలో అందచేస్తారు. అభయ హస్తం డబ్బులను కేటీఆర్ డ్వాక్రా మహిళలకు అందిస్తారు.
ఈ సభ ఏర్పాట్లు, కేటీఆర్ కు స్వాగతం పలుకుతూ చేసే బైక్ ర్యాలీ, వివిధ ప్రారంభోత్సవాల పై పాలకుర్తి ఎమ్మెల్యే, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులతో తొర్రూరులో పరిశీలించారు. అనంతరం పార్టీ నేతలు, ముఖ్య కార్యకర్తలతో ఏర్పాట్లపై చర్చించారు. అలాగే అధికారులు, ప్రజా ప్రతినిధులతో కలిసి, హెలిప్యాడ్, బహిరంగ సభా స్థలం, పార్కింగ్ స్థలాలను మంత్రి ఎర్రబెల్లి పరిశీలించారు. ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు. కేటీఆర్ సభ విజయవంతానికి అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.