TRS: తెలంగాణ రాష్ట్రంలో డిసెంబర్ నుండే ఎన్నికల వేడి మొదలు కాబోతుంది. దీనికి ముందుగా గులాబీ బాస్ కేసీఆర్ శంఖారావం పూరించనున్నారు. నిజానికి ఇక్కడ ఎన్నికలకు ఏడాది పైగా సమయం ఉండగా కేసీఆర్ మాత్రం ఈ ఏడాదిలోనే కసరత్తులు మొదలు పెట్టనున్నారు. డిసెంబర్ నెలలో పలు జిల్లాల పర్యటనకు వెళ్లనున్న కేసీఆర్.. ఆయా జిల్లాల నేతలతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నారు. భారీ బహిరంగ సభలు కూడా నిర్వహించనున్నారు.
డిసెంబర్ నెల నుండి టీఆర్ఎస్ పార్టీ కనుమరుగవనుంది. గులాబీ పార్టీ బీఆర్ఎస్ పార్టీగా మారనుంది. వచ్చే నెలలో అధికారిక అనుమతులు రానుండడంతో అప్పటి నుండే కేసీఆర్ ఎన్నికల ప్రచారం మొదలు పెట్టనున్నారట. ఇందుకోసం ముందుగా కొన్ని జిల్లాలను కూడా ఎంచుకున్న కేసీఆర్ అత్యంత సన్నిహితులకు ఆయా జిల్లాల సభల బాధ్యతను అప్పగించినట్లు తెలుస్తుంది. జగిత్యాలలో నిర్వహించే సభ బాధ్యతను కుమార్తె కవితకు అప్పగించినట్లుగా టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నారు.
అయితే.. ఎన్నికలకు ఇంకా సమయం ఉండగానే కేసీఆర్ ముందే ఎందుకు ఇలా రాజకీయాలకు తెర లేపుతున్నారన్నది చర్చకు దారితీస్తుంది. అయితే.. జాతీయ రాజకీయాల ఆలోచనలో ఉన్న కేసీఆర్ ముచ్చటగా మూడవసారి గెలిచిన ముఖ్యమంత్రిగా రాజకీయలలో అడుగుపెట్టాలని ఆలోచిస్తున్నారట. అందుకే ముందుస్తు ఎన్నికలకు వెళ్లినా ఆశ్చర్యం లేదంటున్నారు. సరిగ్గా ఎన్నికలకు ఏడాది ముందు పలు పథకాలు.. హామీలతో దుమ్ములేపడం ఖాయంగా కనిపిస్తుంది.
అయితే.. కేసీఆర్ ఈ మధ్యనే ముందస్తు ఆలోచన లేదని ప్రకటించారు. కానీ.. ఆయన చేసే పనులన్నీ ముందస్తుకు సంకేతంగానే ఉన్నాయి. దీంతో రాజకీయ వర్గాలకు కూడా కేసీఆర్ పనులు అంతుబట్టడం లేదు. ఏడాదికి ముందే ఎన్నికల ప్రణాళికలంటే ఆర్ధిక వనరులు పుష్కలంగా ఖర్చు పెట్టాలి. దానికి ఆయన సిద్దంగానే ఇప్పటి నుండే సభలు మొదలు పెడుతున్నారా? లేక ముందస్తు కోసమే డిసెంబర్ నుండే ఎన్నికల వేడి రగిలించనున్నారా అన్నది రాజకీయ ఆసక్తిగా మారింది.