తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో(TG Assembly) భాగంగా చివరి రోజు అవయవ దానం బిల్లును వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ (Damodara Raja Narsimha) ప్రవేశపెట్టారు. ఈ క్రమంలో బిల్లుపై చర్చ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) మాట్లాడుతూ.. అవయవ దానం బిల్లుకు బీఆర్ఎస్ తరఫున సంపూర్ణ మద్దతు ఇస్తున్నామని ప్రకటించారు. రాష్ట్రంలో అవయవదానానికి అందరినీ ప్రోత్సహించే బాధ్యత ప్రజాపతినిధులుగా అందరిపై ఉందని అన్నారు.
ఈ విషయంలో పార్టీ అందరి తరఫున తాను మాట్లాడంలేదని.. వ్యక్తిగతంగా తాను అవయవ దానానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. స్పీకర్ ఆధ్వర్యంలో అసెంబ్లీ అవరణలో అవయవ దానంపై పేపర్ సైనింగ్ క్యాంపెయిన్ నిర్వహించాలని కోరారు. అన్ని నియోజకవర్గాల్లోనూ అవయవ దానంపై క్యాంపులు ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే ఎమ్మెల్యేలు అందరూ అవయవ దానంపై ప్రతిజ్ఞ చేయాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా జీవన్‌దాన్ (Jeevandaan) ద్వారా 3,724 మంది బాధితులు ఆర్గాన్స్ కోసం దరఖాస్తు చేసుకున్నారని పేర్కొన్నారు.