రంగారెడ్డి జిల్లా భూదాన్ భూముల (Bhoodan Lands) కుంభకోణం కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ కేసు వ్యవహారంలో ఈడీ అధికారులు శుక్రవారం డీజీపీ జితేందర్ ను కలిశారు. ల్యాండ్ స్కాం కేసులో అమోయ్ కుమార్ పాత్రపై సమగ్ర దర్యాప్తు జరపాలని కోరారు. కాగా, మహేశ్వర మండలం నాగారం గ్రామంలో 42 ఎకరాల భూములను ప్రైవేటు వ్యక్తులకు అక్రమంగా కట్టబెట్టడంలో మనీలాండరింగ్ జరిగిందని పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. దీంతో భూదాన్ భూముల వ్యవహారంపై ఈడీ విచారణ ప్రారంభించింది.
కాగా, అమోయ్ కుమార్ గతంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గా విధులు నిర్వహించారు. అప్పుడే భూముల అక్రమ బదలాయింపు జరిగిందని అభియోగాలు వచ్చాయి. ఈ వ్యవహారంలో అమోయ్ ఐఏఎస్ కీలక పాత్ర వహించారనే ఆరోపణలు వున్నాయి. అందుకే అమోయ్ కుమార్ పాత్ర పై విచారణ జరిపి, కేసులు నమోదు చేసేలా స్థానిక పోలీసులను ఆదేశించాలని డీజీపీకి ఈడీ అధికారులు విజ్ఞప్తి చేశారు.
అలాగే రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో ఆమోయ్ కుమార్ కలెక్టర్ గా పని చేసిన సమయంలో జరిగిన భూ లావాదేవీలపై వచ్చిన ఫిర్యాదుల పైనా దర్యాప్తు జరపాలని కోరారు. పలువురు బాధితుల నుంచి ఇప్పటికే ఆయనపై 12 ఫిర్యాదులు వచ్చాయని ఈడీ అధికారులు డీజీపీకి తెలిపారు. భూదాన్ ల్యాండ్స్ (Bhoodan Lands) వ్యవహారంలో వివరాలు కోరుతూ పోలీసులకు ఈడీ లేఖ రాసిన విషయాన్ని డీజీపీ దృష్టికి తీసుకెళ్లారు.
Also Read : సీఎం రేవంత్ రెడ్డికి కేసీఆర్ స్ట్రాంగ్ కౌంటర్(వీడియో)
తాజాగా ఈడీ రాసిన లేఖకు తెలంగాణ డీజీపీ స్పందించారు. నాగారం తో పాటు పలు కేసులకు సంబంధించిన వివరాలను ఈడీకి అందజేశారు. శంకరాహిల్స్ సొసైటీ, బాలసాయిబాబా ట్రస్ట్, నాగారం భూములు, రాయదుర్గంలోని కొన్ని ల్యాండ్‌ల వివరాలు ఈడీకి అందించారు. పోలీసుల నుంచి వివరాలు రావడంతో ఈడీ విచారణ ముమ్మరం కానుంది. మరోవైపు అమోయ్ కుమార్ తో పాటు మరో నలుగురు ఐఏఎస్ అధికారులకు సంబంధించిన వివరాలను తెలంగాణ పోలీసులు ఈడీకి పంపించినట్లు సమాచారం.