21 రోజుల పాటు నిర్వహించే తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను నిర్వహించేందుకు కార్యాచరణ ప్రణాళికతో కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. ఐడిఓసిలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో మండల స్పెషల్ అధికారులు, మున్సిపల్ కమీషనర్లు, ఎంపిడివోలు, మండల వ్యవసాయ అధికారులతో జిల్లా కలెక్టర్ వేడుకల నిర్వహణపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 21 రోజుల జరిగే వేడుకలను అన్ని శాఖల అధికారులు ప్రజాప్రతినిధుల సమన్వయంతో విజయవంతం చేయాలన్నారు. జూన్ 3 న చేపట్టే తెలంగాణ రైతు దినోత్సవానికి పకడ్బందీ చర్యలు చేపట్టాలన్నారు. రైతు వేదికలో చేపట్టే ఈ కార్యక్రమానికి, ఆయా క్లస్టర్ పరిధిలో వచ్చే గ్రామాల నుండి రైతులను సమీకరించాలన్నారు. ఎడ్ల బండ్లు, ట్రాక్టర్‌ల ద్వారా రైతులు రైతు వేదికకు ఊరేగింపుగా చేరుకోవాలన్నారు. రైతు వేదికలను ఒకరోజు ముందస్తుగానే విద్యుత్ దీపాలతో అలంకరించాలన్నారు. సమావేశం ఏర్పాటుచేసి, రైతుబంధు, రైతు భీమా తదితర సంక్షేమ పథకాలపై వివరించాలని, రైతు బీమా లబ్ది పొందిన కుటుంబంతో వారు పొందిన సాయం గురించి వారితోనే పంచుకోవాలని అన్నారు. ముందస్తు సాగు, పంట మార్పిడిలపై అవగాహన కల్పించి, ప్రయోజనాలను వివరించాలన్నారు. రైతువేదికలో ప్రభుత్వం రైతులకు అందించిన సంక్షేమ పథకాలపై స్క్రీన్‌పై డాక్యుమెంటరీ ప్రదర్శించాలన్నారు. రోజువారి కార్యక్రమాలను ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ తీయించాలన్నారు. వేసవి దృష్ట్యా షామియానాలు, త్రాగునీరు, భోజనాలు సౌకర్యవంతంగా ఏర్పాటు చేయాలని కలెక్టర్ తెలిపారు.
అనంతరం పంట సాగు పద్దతులపై వ్యవసాయ శాఖచే రూపొందించిన గోడపత్రిక, కరపత్రాలను కలెక్టర్ ఆవిష్కరించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్లు స్నేహాలత మొగలి, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాదికారి వి.వి.అప్పారావు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి విజయనిర్మల, ఏ.డి.ఏ సరిత, తదితరులు పాల్గొన్నారు.