హైదరాబాద్ నగరం తర్వాత, ఖమ్మం నగరం అభివృద్ధిలో దూసుకుపోతూ, ఇతర నగరాలకు ఆదర్శంగా నిలుస్తుందని రాష్ట్ర రవాణా శాఖామాత్యులు పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. నగర పాలక సంస్థ కార్యాలయ భవన ప్రారంభోత్సవం జరిగి సంవత్సరం అయిన సందర్భంగా కార్యాలయంలో కేక్ కట్చేసి సంబురాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, పారిశుద్ధ్య విషయంలో నగరం ఎంతో ప్రగతి సాధించిందన్నారు. సాంకేతికంగా ఎంతో ముందుకు వెళ్లినట్లు, మార్కెట్లు, డ్రైనేజీలలో కొత్త పుంతలు తొక్కినట్లు ఆయన తెలిపారు. గతంలో చెత్తకుప్పలు కనపడేవని, ఇప్పుడు ఎక్కడా చెత్తకుప్పలు లేకుండా పకడ్బందీ చర్యలు చేపడుతున్నారని అన్నారు. మేయర్, కమీషనర్ లు సమన్వయంతో, ప్రతి విషయంలో ఎక్కడా వెనక్కి తగ్గకుండా, అభివృద్ధి లో రాజీలేకుండా ముందుకు సాగుతున్నారన్నారు.
ట్యాక్సుల వసూలు, అభివృద్ధి పనులు, కార్పొరేషన్ కి ఏం కావాలో అవి మంజూరు అయ్యేలా చర్యలు చేపట్టారన్నారు. అద్దె ట్రాక్టర్ ల స్థానంలో క్రొత్త ట్రాక్టర్ ల కొనుగోలు చేసినట్లు, నగర పాలక కు క్రొత్త వాహనాలు సమకూర్చుకున్నట్లు ఆయన తెలిపారు. టీఎస్ బి-పాస్ ప్రవేశపెట్టి, సాంకేతికంగా ఎంతో ముందుకు వెళ్లారని మంత్రి అన్నారు. వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ల అభివృద్ధి, వాటిని ప్రజల్లోకి విస్తృత ప్రచారం కావించారన్నారు. నగరం, అన్ని రంగాల్లో ఇతర నగరాలకు ఆదర్శంగా నిలిచిందన్నారు.
కార్యక్రమం లో మేయర్ పునుకొల్లు నీరజ, నగరపాలక సంస్థ కమీషనర్ ఆదర్శ్ సురభి, సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, డిప్యూటీ మేయర్ పాతిమా జోహారా స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులు తదితరులు పాల్గొన్నారు.