Thursday, September 19, 2024
HomeతెలంగాణKhammam: జర్నలిస్టుల ఇళ్లస్థలాల కోసం మహాధర్నా

Khammam: జర్నలిస్టుల ఇళ్లస్థలాల కోసం మహాధర్నా

జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కోసం తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు హైదరాబాదులోని ఇందిరా పార్క్ వద్ద గురువారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు నిర్వహించే మహాధర్నాను విజయవంతం చేయాలని యూనియన్ ఖమ్మం జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. స్థానిక ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ఖమ్మంలో జరిగిన బీఆర్ఎస్ ఆవిర్భావ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ జర్నలిస్టుల అందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తామని హామీ ఇచ్చి సరిగ్గా 5 నెలలు అవుతున్నా నేటి వరకు దానిని నెరవేర్చకపోవడం దారుణమన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కోసం ముందుండి పోరాడిన వారిలో జర్నలిస్టుల పాత్ర ప్రముఖమైనదని చెప్పారు. గతంలో కొన్ని ప్రభుత్వాలు జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చాయని… పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో 9 ఏళ్లయినా వర్కింగ్ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వకపోవడం సరికాదన్నారు. కనీసం ఇళ్ల స్థలాలు ఇచ్చైనా రాష్ట్ర ఆవిర్భావం కోసం జర్నలిస్టులు పోరాడిన సార్ధకత చేకూర్చాలన్నారు. జర్నలిస్టుల ఇళ్ల స్థలాల విషయంలో రకరకాల కారణాలు చూపుతూ కాలయాపన చేస్తూ వచ్చిన ప్రభుత్వం సుప్రీంకోర్టు తీర్పు వెలవడిన నేపథ్యంలో ఇకనైనా స్థలాలు ఇచ్చి ఆదుకోవాలని కోరారు. తామేమీ ప్రభుత్వానికి వ్యతిరేకం కాదని జర్నలిస్టులకు ఇచ్చిన హామీని నెరవేర్చుకోవడం కోసమే ఈ మహాధర్నాను చేపట్టినట్లు తెలిపారు. పాత్రికేయ మిత్రులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ మహాధర్నాను విజయవంతం చేయాల్సిందిగా జిల్లా కార్యదర్శి పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కమిటీ సభ్యులు సాతుపాటి రామయ్య, జిల్లా ఉపాధ్యక్షులు గరిడేపల్లి వెంకటేశ్వర్లు, సభ్యులు కె.శివారెడ్డి, ధనాలకోట రవికుమార్, ఇ.వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News