మున్నేరు వరదముంపు ప్రాంతాలైన మండల పరిధిలోని రాజీవ్ గృహకల్ప, జలగంనగర్ ప్రాంతాల్లో రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటించారు. వరద బాదితులను పరామర్శించి వారి సంక్షేమం గురించి అడిగి తెలుసుకున్నారు.
వరద సహాయక చర్యలు, ప్రభుత్వ సాయం గురించి ఆరా తీశారు. కొందరు వరద బాధితులు తమకు ప్రభుత్వం నుంచి ఇచ్చే వరదసాయం అందలేదని మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. అధికారులను పిలిచి వాస్తవంగా ఇళ్లు నీట మునిగిన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సాయం
అందాలని, మరోసారి ఇంటింటి సర్వే చేపట్టి అర్హులను గుర్తించాలని మంత్రి ఆదేశించారు. అనర్హులకు ఒక్కరికి కూడా పరిహారం అందడానికి వీలులేదని హెచ్చరించారు. వీధులన్నీ శుభ్రం చేసి దుర్వాసనలు రాకుండా బ్లీచింగ్ చల్లాలని సూచించారు. వరద ముంపు ప్రాంత
ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడడమే కాకుండా ప్రభుత్వ సాయం అందేలా కృషి చేయాలని అధికారులను ఆదేశించారు.
కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ మదుసూదన్ నాయక్, ఆర్డీఓ గణేశ్, తహసీల్దార్ రాంప్రసాద్, ఎంపీడీఓ కుమార్, ఎంపీఓ రాజారావు, కాంగ్రెస్ నాయకులు మద్దినేని స్వర్ణకుమారి, కళ్లెం వెంకటరెడ్డి, మద్ది వీరారెడ్డి, భుజంగరెడ్డి, శ్రీను, మహేశ్, అజ్మీరా అశోక్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.