తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పట్టాలు పంపిణి చేసిన రైతులకు ఇక నుండి రైతు బంధు, రైతు భీమా, ఉచిత విద్యుత్ పథకాన్ని వర్తించే విధంగా ముఖ్యమంత్రి కేసీఅర్ నిర్ణయం తీసుకున్నారని రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, ఆర్ధిక శాఖల మంత్రి హరీష్ రావు ప్రకటించారు. స్థానిక భక్త రామదాసు కళాక్షేత్రంలో అర్హులైన 6589 మందికి గాను 13,139.05 ఎకరాలకు పోడు రైతులకు పట్టాలను మంత్రులు హరీష్ రావు, పువ్వాడ అజయ్ కుమార్ లు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో ముందుగా గురువారం అకాల మరణం చెందిన రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ వేద సాయిచంద్ మృతి పట్ల మంత్రులు దిగ్భ్రాంతి వ్యక్తం చేసి, వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. ఖమ్మం, సత్తుపల్లి, వైరా, ఇల్లందు నియోజకవర్గాల పరిధిలోని 77 గ్రామ పంచాయతీలు, 9 మండలాల పరిధిలో ఉన్న 6589 మంది పోడు రైతులకు గాను 13,139.04 ఎకరాలకు సంబంధించి పాస్ పుస్తకాలను మంత్రులు హరీష్ రావు, పువ్వాడ అజయ్ కుమార్ లు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ, ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న వారికి ప్రభుత్వం పోడు పట్టాలను అందజేసి, పోడు పట్టాలతో పాటు రైతు బంధు, రైతు భీమా, ఉచిత కరంట్, ప్రభుత్వ అన్ని ఫలాలకు హక్కుదార్లుగా చేసామన్నారు. శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షల 6 వేల ఎకరాల పోడు భూములకు పట్టాల పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మ్యానిఫెస్టో లో ఉన్నవి అమలుచేసినట్లు, మ్యానిఫెస్టో లో లేనివి పథకాలు చేపట్టినట్లు ఆయన తెలిపారు. రాష్ట్రంలో 2471 గూడెంలు, తండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేశామన్నారు. ఖమ్మం లో క్రొత్త ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటు చేసినట్లు ఆయన అన్నారు. గత 9 సంవత్సరాల్లో 18,519 కోట్లు గిరిజన సంక్షేమానికి ఖర్చు చేసినట్లు మంత్రి తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వసతుల కల్పన, అభివృద్ధితో గతంలో 30 శాతం ఉన్న ప్రసవాలు, ఇప్పుడు 70 శాతానికి చేరాయన్నారు. కళ్యాణలక్ష్మి, ఆసరా పెన్షన్లు, కేసీఆర్ కిట్, మిషన్ భగీరథ, ఇలా ఎన్నో పథకాలతో దేశానికి ఆదర్శంగా తెలంగాణ రాష్ట్రం నిలిచిందని, తెలంగాణ ఆచరిస్తుంది.. దేశం అనుసరిస్తుంది అనే స్థాయికి చేరిందని అన్నారు. రూ. 72 వేల కోట్లు రైతుల ఖాతాల్లో నేరుగా రైతుబంధు పథకం తో జమ అయ్యాయన్నారు. రైతుబంధు నగదు బదిలీ, రైతుల పట్ల ప్రభుత్వ చిత్తశుద్దికి నిదర్శనం అని అన్నారు. దక్షిణ భారతదేశ ధాన్యాగారంగా తెలంగాణ రూపుదిద్దుకొందని, ఇది ప్రభుత్వంచే పుష్కలమైన సాగునీరు, కోతల్లేని కరంట్, పంట పెట్టుబడిగా రైతుబంధు, అన్ని వసతుల కల్పనతో సాధ్యమైందన్నారు. ఖమ్మం జిల్లా అద్భుత ప్రగతి సాధించిందని, ఆదివాసీ కొత్తగూడెం నూతన జిల్లాగా ఏర్పడడంతో అభివృద్ధిపథంలో ఉందని ఆయన తెలిపారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో 500 పడకల ఆసుపత్రులు, సత్తుపల్లి, మధిర, వైరా, ఇల్లందుల్లో 100 పడకల ఆసుపత్రులు, 22 మహిళా రెసిడెన్షియల్ స్కూళ్లు, 95 క్రొత్త గురుకులాలు, 1002 గురుకుల పాఠశాలల్లో 6 లక్షల మంది విద్యార్థులు విద్యానభ్యసించుచున్నట్లు మంత్రి అన్నారు. గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లతో 500 మందికి ప్రతి సంవత్సరం డాక్టర్లుగా ప్రవేశం లభిస్తున్నట్లు ఆయన తెలిపారు. 250 కోట్ల రూపాయలతో 3 ఫెజ్ లైన్ల తో గిరిజనుల పంటపొలాలకు విద్యుత్ అందుతుందని ఆయన అన్నారు. స్వంతంగా ఉపాధికి ప్రభుత్వం ఊతం ఇస్తుందని, విదేశాల్లో చదువుకు అంబేద్కర్ ఓవర్సెస్ పథకం ద్వారా రూ. 20 లక్షల చేయూత, సేవాలాల్, కొమురం భీం జయంతులు అధికారికంగా నిర్వహిస్తున్నట్లు, ఆదివాసీలకు రూ. 50 కోట్లతో బంజారాల ఆత్మగౌరవ భవనం, కొమురం భీం భవనం బంజారాహిల్స్ లో నిర్మించినట్లు మంత్రి అన్నారు. పోడు పట్టాల వచ్చాక, అటవీ శాఖ అధికారులు, పోలీసులు కన్నెత్తి చూడరని, పోడు భూములకు మీరే ఓనర్లు, హక్కుదార్లని, అడవి బిడ్డలను అన్నదాతలుగా మార్చిన ఘనత కేసీఆర్ దేనని మంత్రి తెలిపారు.
ఈ కార్యక్రమంలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడుతూ, జిల్లాలో 6589 మంది పోడు రైతులకు 13,139.04 ఎకరాలకు సంబంధించి పొడుభూములకు పట్టాల పంపిణీ చేసినట్లు తెలిపారు. 2005 లో రూపొందించిన ఆర్ఓఎఫ్ఆర్ చట్టం మేరకు పోడు భూముల్లో సాగుచేస్తున్న వారికి హాక్కుదార్లుగా పట్టాలు ఆందజేసినట్లు తెలిపారు. పట్టాలు పొందిన వారికి రైతుబంధు, రైతుభీమా తదితర అన్ని ప్రభుత్వ ఫలాలు అందుతాయని అన్నారు. సీతారామ ప్రాజెక్ట్ ద్వారా సాగునీరు అందుతుందని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎంపీలు నామా నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్ర, స్పెషల్ సీఎస్ రామకృష్ణ రావు, జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, వైరా, ఇల్లందు ఎమ్మెల్యేలు రాములు నాయక్, హరిప్రియ నాయక్, రాష్ట్ర విత్తనాభివృద్ది సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, డీసీఎంఎస్ చైర్మన్ రాయల శేషగిరిరావు, నగర మేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, భద్రాచలం ఐటిడిఎ పీవో గౌతమ్ పోట్రూ, ఖమ్మం మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి, జిల్లా అటవీ అధికారి సిద్దార్థ్ విక్రమ్ సింగ్, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షులు నల్లమల వెంకటేశ్వర రావు, ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.