Friday, November 22, 2024
HomeతెలంగాణKhammam: కట్టుదిట్టంగా నిర్వహించాలి: కలెక్టర్ గౌతమ్

Khammam: కట్టుదిట్టంగా నిర్వహించాలి: కలెక్టర్ గౌతమ్

కంప్లైట్స్ కోసం 1950 టోల్ ఫ్రీ నెంబర్

లోకసభ ఎన్నికల పోలింగ్ విధులను సిబ్బంది కట్టుదిట్టంగా నిర్వహించాలని ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. ఖమ్మం రూరల్ మండలం పొన్నెకల్ లోని శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఖమ్మం, పాలేరు అసెంబ్లీ సెగ్మెంట్ల డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను కలెక్టర్, పోలీస్ కమీషనర్ సునీల్ దత్ తో కలిసి పరిశీలించారు.

- Advertisement -

డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలలో పోలింగ్ సిబ్బందికి పోలింగ్ సామాగ్రి పంపిణీ చేసే సమయంలో అప్రమత్తంగా ఉండాలని, ర్యాండమైజేషన్ ద్వారా పోలింగ్ కేంద్రాలకు కేటాయించిన ఈవిఎం యంత్రాలను సదరు పోలింగ్ కేంద్రాల సిబ్బందికి అప్పజెప్పాలని, రిజర్వ్ ఈవీఎం యంత్రాలు, రిజర్వు పోలింగ్ సామాగ్రి సెక్టార్ అధికారుల వద్ద భద్రంగా ఉండాలని, సెక్టార్ అధికారులు, పోలింగ్ సిబ్బంది ఎన్నికల నియమ, నిబంధనలను తూ.చా. తప్పకుండా పాటించాలని కలెక్టర్ తెలిపారు. అనంతరం కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ, డిస్ట్రిబ్యూషన్ కేంద్రంలో పోలింగ్ సిబ్బందికి పోలింగ్ సామాగ్రి అందజేసే కార్యక్రమాన్ని పరిశీలించడం జరిగిందని, పోలింగ్ కేంద్రాలలో సజావుగా పోలింగ్ జరిగేందుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు పూర్తి చేసామని అన్నారు.

ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా, ఖమ్మం జిల్లాలోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం, అశ్వారావుపేట అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటలకు పోలింగ్‌ జరుగుతుందన్నారు. ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో ఉన్న 1896 పోలింగ్ కేంద్రాల వద్ద మే -13న ఖమ్మం పార్లమెంటు స్థానానికి పోలింగ్ నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేశామని, వేసవి దృష్టిలో ఉంచుకొని ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద ప్రజలకు అవసరమైన చల్లని నీరు, క్యూలైన్ల వద్ద టెంట్, ఇతర సౌకర్యాలు కల్పించామని అన్నారు. జిల్లాలోనీ పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేశామని, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద అదనపు బలగాలను మోహరించామని తెలిపారు.

ఓటర్లందరూ తప్పనిసరిగా మే 13న జరిగే పోలింగ్ లో పాల్గొనేందుకు పోలింగ్ కేంద్రానికి వచ్చి, వారి ఓటు హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్ పిలుపు నిచ్చారు. జిల్లాలో ఎవరైనా ప్రలోభాలకు గురి చేయటం, ఉల్లంఘనలు దృష్టికి వస్తే సి–విజిల్‌ యాప్‌కు, 1950 టోల్ ఫ్రీ నెంబర్ కు ఫిర్యాదు చేయవచ్చన్నారు. ఎన్నికలలో మనం వేసే ఓటు మన భవిష్యత్తును నిర్దేశిస్తుందని, ఎటువంటి ప్రలోభాలకు గురి కాకుండా ప్రజలు ఆలోచించి, స్వేచ్చగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని కలెక్టర్ అన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ డి. మధుసూదన్ నాయక్, సహాయ రిటర్నింగ్ అధికారులు ఆదర్శ్ సురభి, ఎం. రాజేశ్వరి, అధికారులు, తదితరులు ఉన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News