తెలంగాణకు సింగరేణి ఒక ఆర్థిక, సామాజిక జీవనాడి లాంటిదని, కేంద్రం బొగ్గు గనులను ప్రైవేటీకరణ కుట్రలకు తెర లేపిందని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మండిపడ్డారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి బ్లాక్ 3, శ్రావణ్‌పల్లి, పెనగడప గనులకు మరోసారి వేలంకు నోటిఫికేషన్ వేసిందని అయా ప్రక్రియలను ఉపసంహరించుకోకపోతే మహోద్యమం చేపడతామని పువ్వాడ అజయ్ హెచ్చరించారు.
తెలంగాణకు సిరుల గని అయిన మన బొగ్గు గనులను కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. ముఖ్యంగా బొగ్గు గనుల ద్వారా విద్యుత్ ను ఉత్పత్తి చేసుకుని, ప్రజల ప్రయోజనాలు, వ్యవసాయం కోసం రైతులకు ఉచితంగా అందిస్తున్నామని పేర్కొన్నారు.
దాదాపు 135 సంవత్సరాల చరిత్ర కలిగిన సింగరేణి ఎన్నో లక్షల మందికి ఉపాధిని కల్పించిందని, రోడ్లు, విద్యాలయాలు, ఆసుపత్రులు ఏర్పాటు చేసి మనకు అశ్రమాన్ని కల్పించిందన్నారు. నేడు కేంద్రం అనాలోచిత నిర్ణయం వల్ల సింగరేణిని మనకు దూరం చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తుంది అని కేంద్ర ప్రభుత్వం పై మంత్రి ధ్వజమెత్తారు.
సింగరేణిని ప్రైవేటీకరిస్తే రాష్ట్రం చీకటిమయం అవుతుందని, బొగ్గు గనుల్లో వచ్చే లాభాలను పంచే సంస్థ కార్మికులు శ్రమ దోపిడీకి గురవుతారని, వారసత్వ ఉద్యోగాలు, ఉద్యోగ భద్రత, నియామకాల్లో రిజర్వేషన్లు, బోనస్‌లు, అలవెన్సులు ఇతర సంక్షేమ కార్యక్రమాలు రద్దవుతాయన్నారు.