Telangana Top in Kidney Failure Cases: ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ తాజాగా వెలువరించిన అధ్యయన ఫలితాలు తెలంగాణ ప్రజలను షాకింగ్‌కు గురిచేశాయి. భారతదేశంలో మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్న రాష్ట్రాల జాబితాను పరిశీలిస్తే తెలంగాణ టాప్‌లో ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో ప్రతి 14 మంది అడల్ట్స్‌లో ఒకరు మూత్రపిండాల పనితీరులో బలహీనతతో బాధపడుతున్నారని వెల్లడైంది.
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) కొత్త అధ్యయనం ప్రకారం తెలంగాణ ప్రజారోగ్యం సంక్షోభంలో ఉందనే వార్తలు ఆందోళనను కలిగిస్తున్నాయి. కిడ్నీ ఆరోగ్య సమస్యలపై ICMR–INDIAB ప్రాజెక్ట్‌లో భాగంగా 31 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 25,000 మందికి పైగా అడల్ట్స్‌ను సర్వే చేశారు. 7.4% తో తెలంగాణ టాప్‌లో ఉండగా.. రెండో స్థానంలో గోవా ఉంది. ఒడిశా (6.2%), కేరళ (6.1%) అత్యధిక దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి (CKD) ప్రాబల్యాన్ని నమోదు చేశాయని అధ్యయనంలో వెల్లడైంది. కాగా, తమిళనాడు (4.3%), పుదుచ్చేరి (4.2%), ఆంధ్రప్రదేశ్ (3.0%) రాష్ట్రాల ప్రజలు సేఫ్ జోన్‌లో ఉన్నారు.
Also Read: https://teluguprabha.net/andhra-pradesh-news/landslides-fall-in-srisailam-pathala-ganga/
వందలాది కేసులు
తెలంగాణలో మూత్రపిండాల వ్యాధి పెరగడానికి గల కారణాలపై ICMR పలు కారణాలను విశ్లేషించింది. నొప్పి నివారణ కోసం తరచుగా మందులు వాడటం, కలుషితమైన తాగునీరు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో డయాబెటిస్, రక్తపోటు కేసుల పెరుగుదల కారణాలుగా వైద్యులు పేర్కొన్నారని తెలిపింది. ఇక హైదరాబాద్‌తో పాటు జిల్లా ప్రధాన కార్యాలయాల్లోని ఆసుపత్రుల్లో డయాలసిస్ వార్డులు, అవుట్ పేషెంట్ విభాగాల్లో ప్రతి నెలా వందలాది మంది కొత్త కిడ్నీ రోగులు అడ్మిట్ అవుతున్నారని వెల్లడైంది.
యుక్త వయసులోనే
ఇక 20 ఏళ్ల వయసులోనే అధిక రక్తపోటుతో బాధపడేవారికి 30 ఏళ్లు నిండకముందే కిడ్నీ ఫెయిల్ సమస్యలు ఎదుర్కొంటున్నారని NIMS నెఫ్రాలజీ విభాగాధిపతి డాక్టర్ భూషణ్ రాజు అన్నారు. అయితే జిమ్‌కు వెళ్లే యువకులు ఎక్కువగా ప్రోటీన్ సప్లిమెంట్లు, క్రియేటిన్‌లను ఎక్కువగా వాడుతున్నారని.. ఇది చాలా ఆందోళనకరమైన విషయమని పేర్కొన్నారు. వీటి వల్ల మూత్రపిండాలు దెబ్బతింటాయని తెలుసుకోకపోవడమే కారణమన్నారు. డాక్టర్ల సలహాలు, సూచనలు పాటించకుండా ఫిట్‌నెస్ కోసం ప్రయత్నిస్తున్నారని.. ఇది చాలా ప్రమాదకరమని వెల్లడించారు.
ఇక గ్రామీణ ప్రాంతాల ప్రజలు ఎక్కువగా అర్హత లేని గ్రామీణ వైద్యులను సంప్రదించడం, నొప్పి నివారణ మందులను ఇష్టారీతిన వాడుతున్నారని సీనియర్ నెఫ్రాలజిస్ట్ డా. కె. రాకేష్ అన్నారు. సాధారణ జ్వరం నుంచి కీళ్ల నొప్పి వరకు ప్రతి వ్యాధికి స్టెరాయిడ్ లేదా, ఇంజెక్షన్లను కొందరు వైద్యులు సూచిస్తున్నారని.. ఇది మెల్లగా మూత్ర పిండాల పనితీరుపై ప్రభావం చూపిస్తుందన్నారు. పెద్ద ఆస్పత్రులకు చేరుకునే నాటికి అప్పటికే మూత్రపిండాలు దెబ్బతిని.. పరిస్థితి తీవ్రంగా మారుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.
మద్యపానం ఎఫెక్ట్
ఇక మద్యం, ధూమపానం తరచుగా తీసుకోవడం.. కిడ్నీల పనితీరుపై అధిక ప్రభావం చూపుతోందని వైద్యులు గుర్తించారు. దేశంలో మద్యం అమ్మకాల్లో తెలంగాణ టాప్‌లో ఉందన్న విషయం తెలిసిందే.. మద్యపానం కోసం ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో నివసించే వారే అధికంగా ఖర్చు చేస్తున్నారని వెల్లడైంది. దీంతో అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని స్పష్టమవుతోంది. పుట్టినప్పుడు తక్కువ బరువు ఉండటం, చిన్న వయసులోనే స్థూలకాయం, ఆహారశైలిలో మార్పులు, జీవనశైలిలో తడబాటు.. మూత్రపిండాలపై భారం చూపుతున్నాయని వైద్యులు చెబుతున్నారు.
ఈ క్రమంలో భవిష్యత్తులో ఈ వ్యాధి ప్రబలకుండా ఉండాలంటే రాష్ట్ర ఆరోగ్య శాఖ తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. అందుకు అనుగుణంగా మూత్రపిండాల వ్యాధి నిర్మూలనపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రాథమిక ఆరోగ్య కార్యక్రమాలు నిర్వహించాలని వైద్యులు సూచిస్తున్నారు. 30 ఏళ్లు పైబడిన వారికి లేదా డయాబెటిస్, రక్తపోటుతో కుటుంబ చరిత్ర కలిగిన వారికి సాధారణ కిడ్నీ స్క్రీనింగ్‌ను నిర్వహించాలని ప్రజారోగ్య నిపుణులు కోరారు. పాఠశాలలు, జిమ్‌లు, గ్రామీణ ఆరోగ్య కేంద్రాల్లో ఓవర్-ది-కౌంటర్ ఔషధ అమ్మకాలు, అవగాహన డ్రైవ్‌లను చేపట్టాలని సూచించారు.


